Share News

డిజిటల్‌ తెలంగాణ! అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఇంటర్నెట్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:38 AM

డిజిటల్‌ తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ‘టీ-ఫైబర్‌’ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

డిజిటల్‌ తెలంగాణ! అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఇంటర్నెట్‌

  • రాష్ట్ర బ్రాడ్‌బ్యాండ్‌ కమిటీ భేటీలో నిర్ణయం

  • నాలుగు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం

  • ఏప్రిల్‌ నాటికి అన్ని ఆఫీసులకు సర్కారీ ఇంటర్‌నెట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ‘టీ-ఫైబర్‌’ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సామర్ధ్యం, కేబులింగ్‌ సహా ఇతర వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన 8వ రాష్ట్ర బ్రాడ్‌బ్యాండ్‌ కమిటీ సమావేశంలోనూ వేగవంతమైన బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ప్రతి గ్రామంలో ఇంటర్‌నెట్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా టీ-ఫైబర్‌ రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,662 గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ అందించేందుకు వీలుగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ) వ్యవస్థను ఏర్పాటు చేసింది. వీటిలో 8,895 గ్రామాల్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అనుమతినివ్వగానే సర్వీసు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం 42వేల కిలోమీటర్ల మేర భూగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. 690 అటవీ ప్రభావిత ప్రాంతాలతోపాటు పలు జిల్లాల్లో సాంకేతిక కారణాలతో ఇంకా కేబుల్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. భారత్‌ నెట్‌ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.3,500కోట్లతో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా రూ.1,500కోట్లను ఖర్చు చేస్తుండగా, ఇతర అనుమతులు, పరోక్ష ఖర్చులకు కలిపి దాదాపు రూ.4వేల కోట్లు వెచ్చించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, 11నెలల నుంచి రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని నాలుగు గ్రామాల్లో టీ-ఫైబర్‌ ఇంటర్‌నెట్‌ను ఫైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నారు. అలాగే, 2వేల పాఠశాలలు, రైతువేదికలు, పలు పోలీ్‌సస్టేషన్లు, కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇంటర్‌నెట్‌ అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్‌ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారీ ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి రానుంది.

Updated Date - Feb 12 , 2026 | 02:38 AM