Share News

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:06 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌

  • అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య: మంత్రి దామోదర

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించవచ్చని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చదివిన వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, అదే స్థాయి బోధనను కొత్తగా ఏర్పాటైన జిల్లాల కాలేజీల్లోనూ అందించాలని సూచించారు. క్లిష్టమైన అనాటమీ, సర్జికల్‌ ప్రొసీజర్ల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వర్చువల్‌ ల్యాబ్స్‌, సిమ్యులేషన్‌ టూల్స్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి అధునాతన పద్థతులను వినియోగించాలని చెప్పారు.

Updated Date - Jan 22 , 2026 | 05:06 AM