Telangana Govt Schools: సర్కారు బడుల్లో డిజిటల్ పాఠాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:06 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మారుతోంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు.
టీ-ఫైబర్ సహకారంతో ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు
రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల అమలు
ఈ నెలఖారుకు మరో 108 బడుల్లోనూ
వచ్చే విద్యా సంవత్సరం నాటికి 10 వేల బడుల్లో అందుబాటులోకి
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మారుతోంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టీ-ఫైబర్) ఇంటర్‌నెట్ సహకారంతో మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో ఉపాధ్యాయులు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 608 పాఠశాలల్లో జనవరి నెలాఖరు కల్లా డిజిటల్ తరగతులు అందుబాటులోకి తీసుకురావాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోని 500 పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. దేవరకొండ, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ పలు పాఠశాలలు కూడా ఇందులో ఉన్నాయి. మిగిలిన పాఠశాలల్లోనూ నెలాఖరు కల్లా డిజిటల్ బోధన ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 2.010 బడుల్లో, వచ్చే విద్యా సంవత్సరం నాటికి దాదాపు 10వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామని, స్వయంగా పర్యవేక్షించేందుకే విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సీఎం రేవంత్ ఆశించిన మేరకు లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) తరహాలోనే తెలంగాణ విద్యా విధానం (టీఈపీ)ను విద్యా శాఖ తీసుకురాబోతోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. రోజురోజుకు సాంకేతిక మారుతుండడంతో పాటు విద్యా వ్యవస్థలోనూ తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ బడుల్లో మాత్రం ఇంకా నల్లబోర్డులు, చాక్‌పీ్‌సలు, గతంతాలుకా సిలబ్‌సతోనే పాఠాలను చెబుతున్నారు. ఫలితంగా విద్యార్ధులు కొంత వెనుకబాటుకు గురవుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభు త్వం కార్పొరేట్ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాసులను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫలితంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యలోకి డిజిటల్ క్లాసులు అమల్లోకి వస్తున్నాయి. ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో డిజిటల్ బోర్డులోనే ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందనే అన్ని వివరాలను తెలుసుకునే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతోంది. విద్యార్థులకు గణితం అంటే భయాన్ని పోగుడుతూ స్మార్ట్ క్లాసులతో గణితాన్ని చాలా సులువుగా, అర్ధమయ్యే విధంగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. యానిమేషన్ వీడియోలను చూపిస్తూ సైన్స్ పాఠాలను వివరిస్తున్నారు. ఈ డిజిటల్ తరగతుల వల్ల పాఠాల పట్ల ఆసక్తి పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన కూడా విద్యార్ధుల్లో అధికమవుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.