kumaram bheem asifabad- భూముల్లో కందకాల తవ్వకాలు నిలిపివేయాలి
ABN , Publish Date - May 07 , 2026 | 10:36 PM
అటవీ అధికారులు పోడు భూముల స్వాధీన ప్రక్రియలో భాగంగా భూముల్లో కందకాల తవ్వకాలు వెంటనే నిలిపివేసి, తమకు న్యాయం చేయాలని కర్జెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. పోడు భూముల స్వాధీనంలో భాగంగా కర్జెల్లి రేంజ్ పరిధిలోని కర్జెల్లి గ్రామ శివారు ప్రాంతం నుంచి ఎక్స్‌కావేటర్ సహాయంతో గురువారం అటవీ అధికారులు కందకాలు చేపడుతుండగా రైతులు అడ్డుకున్నారు
చింతలమానేపల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి) : అటవీ అధికారులు పోడు భూముల స్వాధీన ప్రక్రియలో భాగంగా భూముల్లో కందకాల తవ్వకాలు వెంటనే నిలిపివేసి, తమకు న్యాయం చేయాలని కర్జెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. పోడు భూముల స్వాధీనంలో భాగంగా కర్జెల్లి రేంజ్ పరిధిలోని కర్జెల్లి గ్రామ శివారు ప్రాంతం నుంచి ఎక్స్‌కావేటర్ సహాయంతో గురువారం అటవీ అధికారులు కందకాలు చేపడుతుండగా రైతులు అడ్డుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు పాల్వాయి సుధాకర్‌రావు రైతుల పక్షాన అధికారులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఎఫ్‌ఆర్‌వో సుభాష్ మాట్లాడుతూ రైతులతో ముందుగానే అటవీ భూములకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. నిబంధనల మేరకు భూమలు స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కర్జెల్లి రేంజ్ కార్యాలయానికి రైతులు వెళ్లి అధికారులతో తమ గోడును చెప్పుకున్నారు. కానీ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం కొంత భాగాన్ని తీసుకొని మిగిలిన భాగాన్ని రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో రైతుల్లో నిరుత్సాహం నెలకొంది. వేరేవాళ్లు సాగు చేసే భూముల్లోకి తాము ఎలా వెళుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్డందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.