DG Soumya Mishra: నిజామాబాద్ జైలు ఘటనపై విచారణాధికారిగా డీఐజీ నియామకం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:46 AM
నిజామాబాద్ కేంద్ర కారారాగంలో ఖైదీలు గంజాయి, నిషేధిత పదార్ధాల వాడకం, ఖైదీలపై జైలు అధికారుల దాడికి సంబంధించి సమగ్ర విచారణకు జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశించారు..
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : నిజామాబాద్ కేంద్ర కారారాగంలో ఖైదీలు గంజాయి, నిషేధిత పదార్ధాల వాడకం, ఖైదీలపై జైలు అధికారుల దాడికి సంబంధించి సమగ్ర విచారణకు జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశించారు. ‘నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి గుప్పు..!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం కథనం ప్రచురితమైంది. స్పందించిన డీజీ సౌమ్యా మిశ్రా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా డీఐజీని ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో డీఐజీ జైలును సందర్శించి పూర్తిస్థాయి విచారణ జరిపి డీజీకి నివేదిక అందజేయనున్నారు. ఓ వైపు జైళ్ల శాఖ విచారణ జరుపుతున్న క్రమంలోనే మరోవైపు జైల్లో గంజాయి, ఖైదీలపై దాడి విషయాలు బయటకు రాకుండా దాచడంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంత జరిగితే కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని జైలు అధికారులను ప్రశ్నించారు. అయితే, తనకు జ్వరంగా ఉందని, అందుకే సమాచారం ఇవ్వలేదని జైలు సూపరింటెండెంట్ విచారణాధికారికి సమాధానమిచ్చి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలిసింది.