ఈత నేర్పించేందుకు వెళ్లి మృత్యువాత
ABN , Publish Date - May 02 , 2026 | 11:57 PM
వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన మనవడు, మనమరాలికి ఈత నేర్పించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి తాత మృతి చెందాడు.
మనవడు, మనవరాలి కోసం వెళ్లిన తాత
పెన్‌పహాడ్, మే 2 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన మనవడు, మనమరాలికి ఈత నేర్పించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి తాత మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ పరిధిలో శనివారం జరిగింది. ఎస్‌ఐ గోపీకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గడ్డం సంజీవరెడ్డి(53)కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అరవిందరెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వేసవి సెలవులు రావడంతో అతడి కుమారుడు, కుమార్తెను తీసుకుని స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఇంటికి వచ్చిన మనమడు, మనమరాలికి ఈత నేర్పించేందుకు సంజీవరెడ్డి శుక్రవారం సాయంత్రం భార్య నాగమ్మతో కలిసి అదే గ్రామానికి చెందిన ఐతగాని సైదులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పిల్లలతో నీటిలో ఆడి వారిని ఒడ్డుకు చేర్చాడు. ఆ సమయంలో కాళ్లకు బురద అంటుకోవడంతో శుభ్రం చేసుకునేందుకు బావిలోకి దూకాడు. అనంతరం బావిపైకి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాక అందులోనే మునిగి గల్లంతయ్యాడు. గమనించిన భార్య నాగమ్మ, మనమడు, మనమరాలు కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో గ్రామంలోకి వచ్చి తెలిపారు. స్థానికులు బావి వద్దకు చేరుకుని వెతికినా కనిపించలేదు. శనివారం ఉదయం ఏడు మోటార్లతో బావిలోని నీటిని తోడగా సంజీవరెడ్డి మృతదేహం బయటపడింది. పిల్లల సరదా తీర్చేందుకు వెళ్లిన ఇంటి పెద్ద మరణంతో కుటుంబం కన్నీరుమున్నీరైంది. మనమడు, మనవరాలు నడుముకు వాటర్ బాటిళ్లతో నీటిలో తాతతో కలిసి ఆడుతుండగా నానమ్మ నాగమ్మ తీసిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సంజీవరెడ్డి కుమారుడు గడ్డం అరవిందరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపాడు.