ధరణి దగా.. భూభారతి నిర్లక్ష్యం
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:02 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కోసం ధరణిని తీసుకొచ్చిన సమయంలో జరిగిన మోసం ఆ రైతును ఉక్కిరిబిక్కిరి చేసింది.
నకిలీ సాదాబైనామాతో 8.25 ఎకరాల భూమి కోల్పోయిన రైతు
నాలుగేళ్లు అధికారుల చుట్టూ తిరిగినా లభించని న్యాయం
ఈ నెల 20న రైతు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా గాజులపహాడ్‌లో ఘటన
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణం
విచారణలో తేల్చిన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్.. సర్కారుకు నివేదిక
రైతు కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్/ నారాయణఖేడ్, ఏప్రిల్ 27(ఆంధ్ర జ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కోసం ధరణిని తీసుకొచ్చిన సమయంలో జరిగిన మోసం ఆ రైతును ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలుగేళ్ల పాటు తన హక్కుల కోసం పోరాడిన అతడు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో అయినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశ పడ్డాడు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అధికారులు .. మోసం వైపే మొగ్గు చూపారు. అయినా సుదీర్ఘ పోరాటం చేసిన ఆ అన్నదాత.. ఇక తన భూమి తనకు దక్కదనే నిరాశతోఈ నెల 20న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు ఆత్మహత్యపై ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, రైతు కమిషన్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం వల్లనే రైతు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండ లం గాజులపహాడ్‌లో రైతు మాధవరావు(61)కుసర్వే నం. 75లో 8.25 ఎకరాలు, సర్వే నం.159లో 1.18 ఎకరాల భూమి ఉంది. 2020లో ధరణి వచ్చాక ఈ భూమిపై సాదాబైనామా రాసుకున్న ఓ రైతు.. మాధవరావుకు తెలియకుండానే రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాదారుగా తన పేరు నమోదు చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మాధవరావు.. తన భూమిని మరో రైతుకు ఎలా బదలాయిస్తారని అధికారులను ప్రశ్నించాడు. రికార్డులు సవరించి న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. అయినా అధికారు లు స్పందించలేదు. భూభారతి చట్టం వచ్చాక మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ధర ఉన్న 8.25 ఎకరాల తన భూమి కళ్లముందే చేజారిపోవటంతో తీవ్ర మానసిక వేదనతో మాధవరావు.. ఈనెల 20న ఆత్మహత్య చేసుకున్నాడు.
లోపాలున్నా పట్టించుకోని అధికారులు
సాదాబైనామా దరఖాస్తు లోపభూయిష్టంగా ఉన్నా రెవె న్యూ అధికారులు లోతైన విచారణ చేయలేదని విమర్శలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ ఉమాహారతి ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయాన్ని ఎత్తిచూపారు. రెవెన్యూ కార్యాలయంలో భూ బదలాయింపునకు చట్టబద్ధమైన పత్రాలతో కూడిన రికార్డులూ లేవని గుర్తించారు. సాదాబైనామా మీద సంతకాలు పెట్టిన సాక్షులను విచారిస్తే, ఒక సాక్షి ఆ సంత కం తనది కాదని.. విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం. సాదాబైనామా దరఖాస్తు మాధవరావు తల్లి రాసినట్లు చూపిన కొనుగోలుదారు.. తనపేరు మీద రికార్డు బదలాయించే సమయంలో మాధవరావే సాదాబైనామా రాసినట్లు వివరాలు నమోదు చేశాడు. 13బి, 13సి సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో లేవని గుర్తించారు. ఈవిషయంపై భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. 2003లో మాధవరావు తల్లి సాదాబైనామా రాసినట్లు నకిలీ పత్రం పుట్టించారని తెలిపారు. సాంకేతిక లోపాలు ఉన్నా అధికారులు సరిదిద్దే యత్నం చేయలేదని విమర్శించారు. గాజులపహాడ్‌లో రెవెన్యూ సదస్సు కోసం 2,100 దరఖాస్తులు పంపితే.. అధికారులు 6 మాత్రమే స్వీకరించారని చెప్పారు. 2,000 ఎకరాలున్న ఈ గ్రామంలో 150కిపైగా రెవెన్యూ సమస్యలున్నాయని తెలిపారు. భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వ్యవసాయ కమిషన్ తరఫున ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారు. ఆర్‌ఎ్‌సఆర్ విస్తీర్ణంలో పొరపాట్లు, లావణ్య భూమి, 22ఏ క్యాటగిరిలో పెట్టారనే సమస్యలనేఎక్కువ మంది చెబుతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో లక్షల మంది రైతులకు అన్యాయం: కోదండరెడ్డి
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడే అమెరికా లో దివాళా తీసిన కంపెనీకి తెలంగాణ భూరికార్డులను అప్పగించారని, అగ్రిమెంట్‌పై ఆయనే సంతకం చేశారని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2017 లో అప్పటి ప్రభుత్వం లోపభూయిష్టంగా భూప్రక్షాళన చేపట్టిందని విమర్శించారు. ఆ సమయంలో అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా రెవెన్యూ శాఖను నిర్వహించారని గుర్తుచేశారు. భూ రికార్డుల ప్రక్షాళనతో, ధరణి పోర్టల్‌తో లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఽభూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఏడాది గడిచినా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. అంతకుముందు రైతు మాధవరావు కుటుంబాన్ని కోదండరెడ్డి పరామర్శించారు.