Share News

ధర్మపురిలో భూసేకరణపై నిర్వాసితుల ఆందోళన

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:23 AM

ధర్మపురి దేవాలయ అభివృద్థి కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతోందని ధర్మపురి దేవాలయ అభివృద్ధి భూ నిర్వాసితుల సంఘం ఆరోపించింది.

ధర్మపురిలో భూసేకరణపై నిర్వాసితుల ఆందోళన

  • మార్కెట్‌ విలువకు తగిన న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

  • డీపీఆర్‌, సామాజిక ప్రభావ అంచనా అధ్యయనాన్ని వెల్లడించలేదని ఆరోపణ

  • సీఎం రేవంత్‌ జోక్యం కోసం విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి దేవాలయ అభివృద్థి కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతోందని ధర్మపురి దేవాలయ అభివృద్ధి భూ నిర్వాసితుల సంఘం ఆరోపించింది. ప్రాజెక్టు ప్రభావిత భూ యజమానులకు మార్కెట్‌ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంఘ ప్రతినిధుల వివరాల ప్రకారం, 2022లో ప్రభుత్వం గోదావరి నది ఒడ్డున ఉన్న అనేక ఎకరాల రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌), సామాజిక ప్రభావ అంచనా (సోషల్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌) వివరాలను ఇప్పటివరకు నిర్వాసితుల కోసం అందుబాటులో ఉంచలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదని సంఘ సభ్యుడు రంగా అశోక్‌ చెప్పారు. డీపీఆర్‌, సామాజిక ప్రభావ అధ్యయనం నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నారని రవిశంకర్‌ అనే ఓ ఆస్తి యజమాని ఆరోపించారు. స్థానికులతో సంప్రదింపులు జరపకుండా భూసేకరణ చేపట్టబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హామీ ఇచ్చారని, అయితే అధికారులు ఏకపక్షంగా ముందుకు సాగారని సంఘ సభ్యులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో స్థాయిలో భూ యజమానులతో సమగ్ర చర్చలు జరపకుండా పరిహార అవార్డులు ఖరారు చేశారని పేర్కొన్నారు.


దేవాలయ పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ చదరపు గజానికి సుమారు రూ.30 వేల వరకు ఉందని భూ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం నమోదు విలువ ఆధారంగా చదరపు గజానికి రూ.6,600 మాత్రమే పరిహారంగా నిర్ణయించినట్లు ఆరోపించారు. ఇది మార్కెట్‌ విలువలో నాలుగో వంతు కంటే తక్కువన్నారు. పరిహారాన్ని అంగీకరించకపోతే ఆ మొత్తాన్ని కోర్టులో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారని, దీంతో దీర్ఘకాలిక న్యాయపోరాటాల్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భూములు కోల్పోతున్న వారిలో ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా జిల్లా యంత్రాంగం అంగీకరించలేదని కొందరు భూ యజమానులు తెలిపారు. కాగా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే ఒత్తిడి ఉన్నట్లు అధికారులు తమకు తెలిపారని సంఘం పేర్కొంది. పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలతో కలిపి మొత్తం ప్రాజెక్టుకు రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారని, అదే నిధుల పరిధిలో చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఉన్నాయని ఆరోపించింది. తమ సమస్యలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించి, ఆస్తుల వాస్తవ మార్కెట్‌ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

Updated Date - Jun 08 , 2026 | 06:25 AM