Share News

రేవంత్‌ బీజేపీలో చేరతారేమో..!

ABN , Publish Date - May 19 , 2026 | 04:42 AM

సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందేమో.. ‘రేవంత్‌ గారూ.. నాతో కలవండి’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం అదేనేమో....

రేవంత్‌ బీజేపీలో చేరతారేమో..!

  • మరో సువేందులా మారతారేమో.. మోదీ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనేమో

  • టీడీపీ నుంచి వచ్చి రేవంత్‌ సీఎం అయ్యారు.. సీనియర్లను అధిష్ఠానం మోసగించింది

  • కాంగ్రెస్‌లోని సీనియర్లు ఇకనైనా ఆలోచన చేయాలి: ఎంపీ ధర్మపురి అరవింద్‌

నిజామాబాద్‌ , మే 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందేమో.. ‘రేవంత్‌ గారూ.. నాతో కలవండి’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం అదేనేమో’’ అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారిలాగా రేవంత్‌ కూడా పార్టీ మారొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ, రేవంత్‌ మధ్య ఏదైనా సంబంధం(లింక్‌) ఉందేమో నాకు తెలియదు. నేను బీజేపీలో సామాన్య కార్యకర్తను’’ అని చెప్పుకొచ్చారు. సువేందు మొదట టీఎంసీలో కీలక నేతగా ఎదిగి.. తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు సీఎం అయ్యారు. సోమవారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్‌ మాట్లాడారు. టీడీపీ నుంచి వచ్చి రేవంత్‌ సీఎం అయ్యారని, కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్రంలోని సీనియర్లను మోసం చేసిందని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు లాంటివారిని సీఎం చేస్తే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆలోచన చేయాలని, రేవంత్‌ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 2039 వరకు రాహుల్‌గాంధీ ప్రధాని కారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, ఈ లెక్కన ఇంకా పదేళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారని రేవంత్‌ చెప్పకనే చెప్పారని అరవింద్‌ అన్నారు. బండి సంజయ్‌ కుమారుడి కేసు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని వాఖ్యానించారు.

Updated Date - May 19 , 2026 | 04:42 AM