ధరణిలో సూపర్ అడ్మిన్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:38 AM
ధరణి వెబ్‌సైట్‌లో మీ భూమి వివరాలు చూసుకుంటే.. మీ పేరు మీదనే కనిపించేవి. కానీ, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఈసీ తీస్తే.. ఇతరుల పేరు వస్తుంది.
సైట్‌లో రైతు భూమి అతని పేరుపై
అతనికి తెలీకుండానే మరొకరికి సేల్ డీడ్.. ఈసీలో తెలిసిన నిజం
రూ.కోట్లలో అక్రమ లావాదేవీలు
రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లో అక్రమాలు
లోతైన విచారణ చేయాల్సిందే..
న్యాయ విచారణకు యోచన?
హైదరాబాద్, జూలై 7 ( ఆంధ్రజ్యోతి): ధరణి వెబ్‌సైట్‌లో మీ భూమి వివరాలు చూసుకుంటే.. మీ పేరు మీదనే కనిపించేవి. కానీ, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఈసీ తీస్తే.. ఇతరుల పేరు వస్తుంది. ఎందుకంటే మీ భూమి మీకు తెలియకుండానే ఎవరికో సేల్ డీడ్ అయిపోయి ఉంటుంది. గతంలో జరిగిన ధరణి అక్రమాల్లో ఇదీ ఒకటి. ఇలా జరగడం సాధ్యమేనా అంటే.. ఈ అక్రమాలపై జరుగుతున్న విచారణలో ఇలాంటి విషయాలే వెల్లడవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎలా అంటే.. ధరణిలో వేర్వేరుగా రెండు డేటాబేస్ సర్వర్లు రన్ చేశారు. ఒకటి పబ్లిక్ చూసే రీడ్-ఓన్లీ కాపీ కాగా, రెండోది రెవెన్యూ అధికారులు వాడే రైట్‌కాపీ. కొన్నిసార్లు అక్రమార్కులు రైట్ కాపీలో భూమి వివరాలు మార్చినా.. పబ్లిక్ చూసే వెబ్‌సైట్‌లో మాత్రం పాత వివరాలే కనిపించేవి. దీంతో రైతు తన భూమి సురక్షితంగానే ఉందని అనుకునేవాడు. కానీ, అంతర్గతంగా అప్పటికే మ్యుటేషన్ జరిగిపోయి.. మరొకరి పేరుతో సేల్ డీడ్ కూడా జనరేట్ అయిపోయేది. రైతుకు ఈ విషయం బ్యాంకు లోన్ తీసుకునేందుకు వెళ్లినప్పుడో, లేదా ఈసీ తీసినప్పుడో మాత్రమే తెలిసేది. అయితే కలెక్టర్లు, తహసీల్దార్ల ప్రమేయం లేకుండానే.. ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టిన సంస్థ వాడిన కోడింగ్‌ను, డేటా బేస్ స్థాయిలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని భూ లావాదేవీలు జరిగిపోయాయి. ఇలా వేల ఎకరాల ఖరీదైన భూములు చేతులు మారాయి. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో సామాన్య రైతులకు చెందిన ఖరీదైన భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి.
కలెక్టర్, తహసీల్దార్ లాగిన్ అవకుండానే అక్రమార్కులు డేటాబేస్‌లోకి నేరుగా చొరబడ్డారు. సూపర్ అడ్మిన్ లాగిన్ ఐడీలను ఉపయోగించి.. సర్వర్ లోపల డేటా కరెక్షన్ మాడ్యూల్ ద్వారా నేరుగా ఒక ల్యాండ్ ప్రొఫైల్‌ను ఎడిట్ చేశారు. దీంతో కలెక్టర్లకు విషయం తెలియకుండానే డేటాబేస్ మారిపోయింది. సైబర్ నేరాల్లో సాధారణంగా ఎవరు లాగిన్ అయ్యారు? ఏ ఐపీ అడ్రస్ నుంచి మార్పులు చేశారు? అనేది రికార్డవడానికి ఆడిట్ లాగ్స్ ఉంటాయి. అయితే ధరణి పోర్టల్‌లో డేటా బేస్‌లో మార్పులు చేసిన తరువాత నిందితులు కేవలం డేటాను మార్చడమే కాకుండా.. ఆ మార్పు ఎవరు చేశారనే హిస్టరీని చూపించే ఆడిట్ ట్రయల్ టేబుల్స్‌ను కూడా బ్యాక్ ఎండ్ క్వెరీల ద్వారా (ఎస్‌క్యూఎల్ క్వెరీస్) ద్వారా డిలీట్, మాడిఫై చేసినట్లు ఆడిట్‌లో గుర్తించారు. దీని వల్ల ఏ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి మార్పు చేశారో ట్రాక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ధరణి సాంకేతిక లొసుగులతో ఖరీదైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. ఖరీదైన వాణిజ్య స్థలాలు, నివాస స్థలాలను బ్యాకెండ్ మానిప్యులేషన్ ద్వారా సొంతం చేసుకున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 3400 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు, 22ఏ జాబితాలో ఉన్న భూములు చేతులు మారినట్లు తేల్చారు. ఘట్‌కేసర్, శంషాబాద్ రూరల్ పరిధిలో 22ఏ జాబితాలో ఉన్న సుమారు 450 ఎకరాల ప్రభుత్వ భూములు తహసీల్దార్ లాగిన్ ఐడీలను బైపాస్ చేసి.. సాప్ట్‌వేర్ సంస్థకు చెందిన సూపర్ అడ్మిన్ యాక్సెస్‌తో ఏకంగా ప్రైవేటు రియల్టర్ల పేరుతో పట్టా భూములుగా మారిపోయాయని తేలింది. మరోవైపు జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 1850 ఎకరాలకు అక్రమ లావాదేవీలు జరిగాయి. ఈ జిల్లాల్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఫీజు ఎగ్గొట్టేందుకు కూడా ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్(చలానా మొత్తాన్ని రూ.1గా మార్చడం) విధానాన్ని అత్యధికంగా ఉపయోగించినట్లు గుర్తించారు. ఇలా 1080 డాక్యుమెంట్లను నకిలీ డిజిటల్ చలాన్లతో రిజిస్ర్టేషన్ పూర్తి చేశారు. దీని వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.3.95 కోట్ల ఆదాయానికి గండి పడిందని, వందలాది ఎకరాల అసైన్డ్ భూములు బినామీల చేతుల్లోకి వెళ్లాయని తేలింది.
1109 లావాదేవీలు ఒకే వ్యక్తి పేరుతో..!
సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2100 ఎకరాలకు పైగా భూమి.. వారసత్వం, మ్యుటేషన్ లోపాల ఆధారంగా అక్రమ లావాదేవీలతో చేతులు మారినట్లు ఆడిట్‌లో గుర్తించారు. సిద్దిపేట రూరల్ పరిధిలో 1109లావాదేవీలు చట్టవిరుద్ధంగా జరిగినట్లు తేలింది. వారసుల బయోమెట్రిక్, ఎన్‌వోసీలు లేకుండా సాఫ్ట్‌వేర్ బ్యాకెండ్ ఎంట్రీల ద్వారా ఒకే వ్యక్తి పేరుతో మొత్తం భూమి బదిలీ చేసినట్లు గుర్తించారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, హాజీపూర్ పరిధిలో 1200 ఎకరాలు.. నల్లమల అటవీ ప్రాంత సరిహద్దులను, కొన్ని అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకుని లావాదేవీలు నిర్వహించారని తేలింది. హజీపూర్ పరిధిలో 1.18ఎకరాల భూమి 22ఏ జాబితాలో ఉన్నా.. సాగు చేసుకునే దళిత రైతుకు, అతని కుటుంబానికి తెలియకుండానే ధరణి ఆపరేటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇతరుల పేరుమీదికి ఎక్కించారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో 1450 ఎకరాల రికార్డులు మార్చివేసినట్లు తేలింది.
జ్యుడీషియల్ విచారణకు చాన్స్
ధరణి అక్రమ లావాదేవీలపై ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 15 రోజుల్లో తమ నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే.. 2017 నుంచి భూ రికార్డుల ప్రక్షాళన, ఆ తరువాత 2020లో ధరణి వచ్చాక నాలుగేళ్లపాటు జరిగిన లావాదేవీలను నిగ్గు తేల్చడం రెండు వారాల్లో సాధ్యమయ్యే పనికాదు. ఇదే విషయంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టిన కేరళ సంస్థ ఏడాది సమయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత ఎనిమిదేళ్లుగా జరిగిన లావాదేవీలను తేల్చేందుకు జ్యుడీషియల్ విచారణకు సిఫారసు చేసే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలిసింది. సాంకేతిక లోపాలను ఆసరా చేసుకుని అక్రమ లావాదేవీలకు పాల్పడిన వ్యక్తులు వినియోగించిన కోడింగ్ ఏంటి? ఏ మాడ్యూల్‌లో ఏం చేశారు? అనే వివరాలన్నింటిపైనా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండటంతో.. 2 వారాల్లో నివేదిక సాధ్యం కాదనే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ జడ్జితో గానీ, మరెవరితోనైనా న్యాయవిచారణ చేస్తే ప్రయోజనం ఉంటుందనే కోణంలో కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఆపరేటర్ల డిజిటల్ లూటీ..
ధరణి ఆపరేటర్ల డిజిటల్ లూటీ పైనా ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. సాంకేతిక లోపాల కారణంగా సామాన్య రైతులు సర్వం కోల్పోయే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నట్లు గుర్తించారు. మేడ్చల్ జిల్లాలో ఐటీ ఆపరేటర్ కె.నరేష్ (పేరు మార్చాం)కు ధరణి ఆర్కిటెక్చర్‌పై పట్టు ఉంది. దీంతో సర్వర్ బ్యాక్ ఎండ్‌లో ఉన్న ఒక టెస్టింగ్ మాడ్యూల్ ఐడీని యాక్టివ్‌గా ఉంచాడు. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు 84 ఎకరాల నిషేధిత భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి కలెక్టర్ డిజిటల్ కీని బైపాస్ చేసినట్లు గుర్తించారు. తాను సృష్టించిన నకిలీ ఐడీ ద్వారా డేటాబేస్‌లోకి నేరుగా లాగిన్ అయి సదరు భూమి పక్కనే ఉన్న ప్రొహిబిటెడ్ అనే ప్లాగ్‌ను క్లియర్‌గా మార్చివేశాడు. నరేష్ ఆ రికార్డు మార్చిన తరువాత మెయిన్ ఆడిట్ టేబుల్‌ను డిలీట్ చేశాడు. కానీ, సర్వర్ ప్రైమరీ బ్యాక్‌పలో ప్రతి రాత్రి 12 గంటలకు ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యే ట్రాన్సాక్షన్ స్నాప్‌షాట్ ద్వారా అతని ఐపీ అడ్రస్ దొరికిపోయింది. ప్రస్తుతం అతనిపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. కాగా, సిద్దిపేటలో మల్లయ్య అనే రైతుకు చెందిన 4 ఎకరాల భూమి.. ఆయనతోపాటు ముగ్గురు సోదరులకు చెందాల్సి ఉంది. అయితే ధరణిలో వారసత్వ విభాగంలో ఉన్న సాంకేతిక లోపాన్ని మల్లయ్య పెద్దన్న కుమారుడు దళారుల సహాయంతో వాడుకున్నాడు. సాప్ట్‌వేర్ బ్యాక్‌ఎండ్‌లో ఏకపక్షంగా నాలుగు ఎకరాలను సొంతం చేసుకున్నాడు.
మల్లయ్య మొబైల్‌కు ఎలాంటి ఓటీపీ రాలేదు. బ్యాంకుకు వెళితే తప్ప విషయం తెలియలేదు. ఇదే తరహాలో నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో లక్ష్మమ్మ అనే దళిత మహిళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన 1.18 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇది 22ఏ జాబితాలో ఉంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ భూమిపై కన్నేశాడు. సాధారణంగా భూమి బదిలీ కావాలంటే లక్ష్మమ్మ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి. ధరణి ఆపరేటర్ సాయంతో డేటా బేస్ ప్రొఫైల్‌లో లక్ష్మమ్మ ఫోన్ నంబరు స్థానంలో దళారుల నంబరును అప్‌డేట్ చేశారు. మహిళకు తెలియకుండా ఓటీపీ జనరేట్ చేసి.. మ్యుటేషన్ పూర్తి చేసినట్లు గుర్తించారు. ఆ తరువాత తిరిగి ల్యాండ్ రికార్డులో లక్ష్మమ్మ పాత నంబరు అప్‌డేట్ చేశారు.