Share News

అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:46 AM

కేసీఆర్‌ హయాంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ నిర్వహణ వ్యవస్థ పక్కాగా ఉంటుందని, భూమి యజమాని వచ్చి వేలి ముద్ర వేస్తేనే రికార్డు మారుతుందని....

అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..

  • యజమాని వేలి ముద్ర అక్కర్లేదు.. ఓటీపీ అక్కర్లేదు

  • అన్నింటినీ బైపాస్‌ చేస్తూ సాఫ్ట్‌వేర్ల వినియోగం

  • విదేశాల్లో ఉన్న వాళ్లకు తెలియకుండానే పేర్ల మార్పు

  • 8 లక్షల లావాదేవీలు ఆడిట్‌ చేస్తే 22 వేలు తేడా

  • ఘోస్ట్‌ ఐడీలతో లక్షల ఎకరాల రికార్డుల మార్పు

  • టైం క్లాక్‌ మార్చి, పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు

  • కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ సంస్థ నివేదికలో వెల్లడి

  • సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలకు సన్నద్ధం

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ హయాంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ నిర్వహణ వ్యవస్థ పక్కాగా ఉంటుందని, భూమి యజమాని వచ్చి వేలి ముద్ర వేస్తేనే రికార్డు మారుతుందని, ముఖ్యమంత్రి అనుకున్నా దాంట్లో ఎంట్రీలను మార్చలేడని ఆయనే స్వయంగా ప్రకటించారు. మనలాంటి సామాన్యులకు నిజంగానే అది దుర్భేద్యమైన వ్యవస్థగా పనిచేసింది. అందులో ప్రతీ నిబంధన పాటించాల్సిందే. అప్పుడే మన పేరు, భూ విస్తీర్ణం పక్కాగా ఆన్‌లైన్‌లో ఎక్కాయి. అదే సమయంలో రాజకీయ నాయకులకు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు మాత్రం ఎలా అంటే అలా అడ్డగోలుగా రికార్డులు మార్చే గోల్‌మాల్‌ వ్యవస్థగా పని చేసింది. ఇటీవల తప్పుడు చలాన్లతో భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం బట్టబయలు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాగోతాన్ని బయటకు తీయాలని కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ అండ్‌ అస్యూరెన్స్‌ సెంటర్‌(కేఎ్‌సఏఏసీ) అనే ఆడిట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ధరణి మేడిపండు చందాన్ని బయట పెట్టింది. అది పరిశీలించిన 8 లక్షల ధరణి లావాదేవీల్లో 22 వేల లావాదేవీలు సాంకేతికంగా అనుమానాస్పదంగా ఉన్నాయని తేల్చింది. అంటే, దాదాపు 2 నుంచి 3 శాతం లావాదేవీలు తేడాగా ఉన్నాయన్న మాట. అందులో ప్రధానమైనది భూమి యజమాని లేకుండానే అతని ఆధార్‌, వేలిముద్ర, ఓటీపీతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అంటే, ఎక్కడో అమెరికాలో, వేరే రాష్ట్రంలో ఉన్న భూమి యజమానికి తెలియకుండానే ఆధార్‌, వేలిముద్ర, ఓటీపీ ప్రాసె్‌సను అంతా బైపాస్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇందుకోసం ధరణిలో పనిచేసి మానేసిన టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఐడీ పాస్‌వర్డ్‌లను యాక్టివ్‌గా ఉంచుతూ పని కానిచ్చేశారు. రికార్డులు మార్చడానికి ప్రస్తుత అధికారుల ఐడీలను వినియోగిస్తే దొరికిపోతామనే భయంతో ఘోస్ట్‌ ఐడీల ద్వారా అర్ధరాత్రుల్లో డేటాను ట్యాంపర్‌ చేసినట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. దీని వల్ల సైబర్‌ క్రైమ్‌ నిపుణులకు కూడా తొలుత ఐడెంటిటీ ట్రాక్‌ చేయడం సాధ్యం కాలేదు. జనగామ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో జరిగిన చలానా మోసాలపై కూడా సైబర్‌ క్రైమ్‌ అధికారులు సాంకేతికంగా ఎలా జరిగిందో ఫోరెన్సిక్‌ ఐటీ నిపుణులు కనిపెట్టారు.


ధరణి పోర్టల్‌కు, ట్రెజరీకి, బ్యాకింగ్‌ పేమెంట్‌ గేట్‌వేలకు అనుసంధానంగా ఉండే అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ కోడింగ్‌లో తీవ్రమైన లోపాలు గుర్తించారు. అక్రమార్కులు ఏపీఐని బైపాస్‌ చేసి.. బ్యాంకు నుంచి ప్రభుత్వ ఖజానాకు సక్సెస్‌ అని వెళ్లాల్సిన సిగ్నల్‌ను మానిప్యులేట్‌ చేశారు. అంటే బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వానికి పైసా కూడా వెళ్లకపోయినా.. సిస్టమ్‌ మాత్రం పేమెంట్‌ సక్సెస్‌ అని చూపిస్తూ సేల్‌ డీడ్లను అప్రూవ్‌ చేసింది. ఇది సాప్ట్‌వేర్‌ రాసిన కంపెనీ మద్దతు లేకుండా సాధ్యం కాదని ఆడిట్‌ తేల్చింది. కొన్ని ఏజెన్సీలు ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌వేర్‌ డివైజ్‌లను ఉపయోగించి ఆధార్‌ ఓవర్‌రైడ్‌(యుడీఐ బైపాస్‌) చేసే సాప్ట్‌వేర్‌ను ఉపయోగించారు. అసలు భూ యజమాని వేలిముద్ర, ఓటీపీ అవసరం లేకుండానే సిస్టమ్‌లో వెరిఫికేషన్‌ సక్సె్‌సపుల్‌ అని వచ్చేలా క్లోన్డ్‌ ఆల్గారిథమ్స్‌ క్రియేట్‌ చేశారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ భూముల, ఎవరూ పట్టించుకోని వృద్ధుల భూములను టార్గెట్‌ చేయడానికి ఈ టెక్నిక్‌ వాడినట్లు గుర్తించారు. అలాగే టైమ్‌ స్టాంప్‌ ట్యాంపరింగ్‌ కూడా చేశారు. అంటే, రిజిస్ట్రేషన్‌ అయిన తేదీ, సమయాన్ని కూడా పాత డేట్‌కు మార్చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడటానికి, వివాదాస్పద భూములు అమ్మేయడానికి దీన్ని వాడుకున్నారు. ఒక భూమిపై కోర్టు స్టే ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే ఆ భూమి రిజిస్ట్రేషన్‌ అయిపోయినట్లు చూపించడానికి సర్వర్‌ క్లాక్‌ను ట్యాంపర్‌ చేసినట్లు తేలింది. జూలై నెలలో జరిగిన లావాదేవీలను సర్వర్‌ డేటా బేస్‌లోకి వెళ్లి జూన్‌ నెలలో జరిగినట్లుగా బ్యాక్‌ డేట్‌ వేసి న్యాయ వివాదాల నుంచి అక్రమార్కులు తప్పించుకునేలా సహకరించారని ఆడిట్‌ సర్వే తేల్చింది. డేటా బేస్‌ షాడో టేబుల్స్‌ గురించి చాలామందికి తెలిసిందే.. ఆడిట్‌ అధికారులు మెయిన్‌ సర్వర్‌ను నిశితంగా పరిశీలించగా ఒక సమాంతర వ్యవస్థ నడిచినట్లు గుర్తించారు. మెయిన్‌ రికార్డులతో పాటు బ్యాక్‌ఎండ్‌లో కొన్ని షాడో టేబుల్స్‌ క్రియేట్‌ చేసినట్లు పట్టుకున్నారు. ల్యాండ్‌ రికార్డుల ఒరిజినల్‌ డేటా మారకముందే పాత షాడో టేబుల్స్‌లో మార్పులు చేసి, అవి సరిగ్గా పని చేస్తున్నాయో లేదో టెస్టు చేసుకున్న తరువాత మెయిన్‌ సర్వర్‌లో రైతుల పేర్లు మార్చేసినట్లు గుర్తించారు. ఈ మోసానికి పెద్దఎత్తున ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు ఆడిట్‌ అధికారుల విచారణలో తేలింది. సాంకేతిక లోపాలు బయట పడటంతో ప్రభుత్వం హై లెవల్‌ కమిటీ ద్వారా ఒరిజినల్‌ సాప్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌, కన్సల్టెంట్లపై క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌కు సిఫార్సు చేసింది.


ఎన్నో లొసుగులు

నిబంధనలకు విరుద్ధంగా క్లౌడ్‌ సర్వీస్‌ డేటాను విదేశీ సంస్థల నియంత్రణలోకి వెళ్లేలా ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజల ఆస్తుల వివరాల గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే రికార్డులు మారడంతోపాటు, ధరణి పోర్టల్‌ లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌ల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని ఆడిటర్లు గుర్తించారు. సీనియర్‌ అధికారుల డిజిటల్‌ సంతకాలు, లాగిన్‌ వివరాలను ప్రైవేటు వ్యక్తులు, ఆపరేటర్లు వాడిన ఆధారాలు వెలుగు చూశాయి. ఉన్నతాధికారులకు తెలియకుండానే రాత్రివేళల్లో వేల ఎకరాల భూముల యాజమాన్య హక్కులు మారిపోయాయి. ఏ అధికారి పరిధిలో లేని ప్రైవేటు వ్యక్తులు కూడా డేటాను ఎడిట్‌ చేసేలా బ్యాక్‌ డోర్‌ ఎంట్రీలు కల్పించారని గుర్తించారు. నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆడిట్‌లో బయటపడింది. 22ఏ జాబితాను తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు. విలువైన ప్రభుత్వ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి.. ప్రైవేటు వ్యక్తుల పేరుతో మార్చారని తేలింది. పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను కూడా ధరణి ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టినట్లు గుర్తించారు. భూముల విస్తీర్ణంలో భారీ తేడాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఎత్తి చూపింది. పాత రికార్డుల ప్రకారం(ఆర్వోఆర్‌) ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి మధ్య లక్షల ఎకరాల వ్యత్యాసం ఉందని తేలింది. డిజిటలైజేషన్‌ ముసుగులో వేల ఎకరాల భూముల విషయంలో రైతుల పేర్లు తొలగించి, వారి స్థానంలో ఇతరుల పేర్లు చేర్చినట్లు గుర్తించారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ వివాదాలకు అవకాశం ఏర్పడిందని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది.

Updated Date - Jul 07 , 2026 | 06:07 AM