ధాన్య లక్ష్మి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:59 AM
జిల్లాలో ఇందిరా కాంత్రి పథం, మెప్మా వివిధ మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) గ్రామీణ మహిళలకు గొప్ప ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. మహిళలు రంగం ఏదైనా దూసుకుపోతున్నారు. అందుకు
జగిత్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరా కాంత్రి పథం, మెప్మా వివిధ మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) గ్రామీణ మహిళలకు గొప్ప ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. మహిళలు రంగం ఏదైనా దూసుకుపోతున్నారు. అందుకు జగిత్యాల జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలే నిదర్శనంగా నిలుస్తున్నారు. జిల్లాలో వానాకాలం, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు రికార్డు నెలకొల్పాయి. తొమ్మిది సీజన్లలో మహిళా సంఘాలు అనూహ్యంగా రూ.29.69 కోట్ల కమీషన్ ఆర్జించాయి.
ఫకొనుగోలు కేంద్రాల నిర్వహణ
ధాన్యం సేకరణ బాధ్యతలను స్వీకరించిన మహిళా సంఘాలు సొంతంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ యేటా రెండు సీజన్లుగా కొనుగోళ్ల బాధ్యతను చూస్తుండడంతో వారు నిర్వహణలోనూ అనుభవం గడించారు. కొనుగోళ్లు మొదలు కాకముందే గోనె సంచులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రాల వద్దకు వడ్లు తీసుకొచ్చిన రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వంటి పనులన్నీ చేస్తున్నారు. సమస్య ఎదురయినప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి శభాష్ అనిపించుకుంటున్నారు.
ఫపారదర్శకంగా కొనుగోళ్లు...
గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు దాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తూకం వేయడం నుంచి రికార్డులు నిర్వహించడం, మిల్లులకు తరలించడం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటున్నారు. ఈ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి గాను ప్రభుత్వం ప్రతి క్వింటాలుకు కమీషన్ చెల్లిస్తుంది. ఈ కమీషన్ సొమ్ము నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లో జమ కావడం వలన మహిళలు స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గతంలో పరిమితంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ప్రభుత్వం పెద్దఎత్తున మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలు పారదర్శకంగా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఫఏటా రూ.కోట్లలో ఆదాయం..
ఇందిరాక్రాంతి పథం మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములై ఏటా జిల్లాలో రూ.కోట్లలో కమీషన్ పొందుతున్నారు. పురుషులతో సమానంగా ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తూకం వేయడం, గన్నీ సంచులు, లారీలు సమకూర్చడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడం, తేమ శాతం పరిశీలించడం వంటి పనులు చేస్తున్నారు.
ఫవివాదాలకు తావు లేకుండా...
ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. గత రెండు, మూడు సీజన్‌లలో అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులతో కమిటీలు వేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఒక్కో బాధ్యతను పంచుకుని సెంటర్లను నడిపించారు. గతంలో సెంటర్ల నిర్వహణలో ఉన్న లోటుపాట్లపై ముందే అధికార యంత్రాంగం అవగాహన కల్పించింది.
మహిళలు ఆర్థికంగా బలోపేతం
-సత్యప్రసాద్, కలెక్టర్
ధాన్యం కొనుగోళ్ల ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ, అవగాహన కల్పిస్తున్నాము. ఎలాంటి అక్రమాలు, వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు పూర్తి చేస్తున్నాము.
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
-జితేంద్రప్రసాద్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్
జిల్లాలో ప్రతీ యేటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో డీఆర్‌డీఏ, మెప్మా, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేస్తున్నాము. మహిళా సంఘాలకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి కమీషన్ చెల్లిస్తున్నాము. కొనుగోలు కేంద్రాల్లో మహిళలకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాము.
అన్నింటా రాణింపు
-ఉమ, ఇందిరా మహిళా సంఘం సభ్యురాలు, తిప్పన్నపేట గ్రామం
గతంలో మహిళలు వంటింటికి పరిమితమయ్యేవారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. డీఆర్‌డీఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రామైక్య మహిళా సంఘాల ద్వారా ప్రతీ యేటా రెండు సీజన్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాము.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సేకరించిన ధాన్యం వివరాలు...
---------------------------------------------------------------------------------
సీజన్ .... కొనుగోలు చేసిన ధాన్యం (క్వింటాళ్లలో)...కమీషన్ (రూ.లలో)
---------------------------------------------------------------------------------
2021 - 22 యాసంగి - 85,932 - 2.86 కోట్లు
2022 - 23 వానాకాలం - 11,61,872 - 3.66 కోట్లు
2022 - 23 యాసంగి - 12,62,623 - 4.22 కోట్లు
2023 - 24 వానాకాలం - 9,44,915 - 2.18 కోట్లు
2022 - 23 యాసంగి - 12,28,641 - 2.28 కోట్లు
2024 - 25 వానాకాలం - 9,12,889 - 2.89 కోట్లు
2024 - 25 యాసంగి - 13,37,992 - 4.15 కోట్లు
2025 - 26 వానాకాలం - 10,99,779 - 2.46 కోట్లు
2025 - 26 యాసంగి - 15,50,060 - 4.99 కోట్లు
---------------------------------------------------------------------------------
మొత్తం తొమ్మిది సీజన్లు - 95,84,703 - 29.69 కోట్లు
---------------------------------------------------------------------------------