‘ధన్వంతరి స్కాం’ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:18 AM
సంచలనం రేపిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ రూ.516 కోట్ల ఆర్థిక మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో..
హైదరాబాద్ సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): సంచలనం రేపిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ రూ.516 కోట్ల ఆర్థిక మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ పోలీసులు ధన్వంతరి నిర్వాహకులు కొనుగోలు చేసిన ఆస్తులను అటాచ్ చేయగా.. కోర్టు అనుమతితో వాటిని విక్రయించి వచ్చిన ఆదాయాన్ని బాధితులకు పంపిణీ చేసేందుకు తాజాగా నిర్ణయించారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామని నమ్మించిన నిర్వాహకులు.. సుమారు 2 వేల మంది బ్రాహ్మణుల నుంచి రూ.516 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడి ఉడాయించారు. ఈ నేపథ్యంలోనే బాధితుల్లో ఒకరైన సుశ్రాల నరసింహామూర్తి 2023లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ధన్వంతరి ఫౌండేషన్ డైరెక్టర్ కమలాకర్ శర్మతో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకొని అప్పటి సీసీఎస్ డీసీపీ శ్వేత టీమ్ విచారించింది. కొల్లగొట్టిన డబ్బుతో నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో 450 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లో 3,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. వీటన్నింటినీ డీసీపీ శ్వేత అటాచ్ చేయడంతో పాటు ఆ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే ఆ ఆస్తులను తిరిగిచ్చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టేసింది. అనంతరం రిటైర్డ్ జిల్లా అధికారి సమక్షంలో అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేసి వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే సీసీఎ్‌సకు వచ్చి సంప్రదించాలన్నారు.