DGP Shivadhar Reddy: వేగం, నైపుణ్యం, సమన్వయంతోనే సైబర్ నేరాల కట్టడి
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:42 AM
సైబర్ నేరాల్ని సమర్థంగా కట్టడి చేయడంలో వేగం, సాంకేతిక నైపుణ్యం, సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు...
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : సైబర్ నేరాల్ని సమర్థంగా కట్టడి చేయడంలో వేగం, సాంకేతిక నైపుణ్యం, సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సైబర్ నేరాల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సన్మానాలు అధికారులు తమ నైపుణ్యాల్ని నిరంతరం మెరుగుపరుచుకొనేందుకు ప్రేరణనిస్తాయని చెప్పారు. పౌర కేంద్రిత, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై దృష్టిని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఫ్రంట్ లైన్ అధికారుల్ని సాంకేతికంగా శక్తివంతం చేయడంతో సైబర్ క్రైం ప్రతిస్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామని సీఎ్‌సబీ డైరెక్టర్ శిఖాగోయెల్ తెలిపారు. మొత్తం 25 మంది సైబర్ వారియర్లు, సీఎ్‌సబీ కార్యాలయం, సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్లకు చెందిన 22 మంది సిబ్బందిని సన్మానించారు.