నక్సల్స్ కార్యకలాపాలు తగ్గడంతో గంజాయి రవాణా పెరిగింది
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:55 AM
మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడంతో గంజాయి రవాణా పెరిగిందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్
మాదకద్రవ్యాలు రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు
సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా పెడుతున్నాం
వర్గాల మధ్య విభేదాలు సృష్టించే కొందర్ని గుర్తించాం
వారిపై చర్యలు తీసుకుంటాం: డీజీపీ సీవీ ఆనంద్
ఖమ్మం, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడంతో గంజాయి రవాణా పెరిగిందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గతంలో గంజాయి పండించి సరఫరా చేసే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. అప్పట్లో మావోయిస్టులు కూడా గంజాయి స్మగ్లర్లు, గంజాయి పండించ వారి పట్ల కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వారి కార్యకలాపాలు తగ్గిపోవడంతో మళ్లీ గంజాయి దందా పెరిగింది’’అని తెలిపారు. మాదకద్రవ్యాలతో దేశానికి, రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, వీటికి అలవాటు పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్ అని వ్యాఖ్యానించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిసా సరిహద్దుల నుంచి గంజాయి రవాణాకు ఎంట్రీ డోర్‌గా ఖమ్మం ఉందని, దీన్ని నివారించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ రోడ్ సేఫ్టీ అథారిటీ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్‌మీడియాపైనా నిఘా పెంచుతున్నామని, వర్గాల మధ్య విభేదాలను సృష్టిస్తున్న నలుగురైదుగురిని గుర్తించామనితెలిపారు. వీరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.