Share News

ఎస్‌ఐబీ కొత్త సవాళ్లపై దృష్టి సారించాలి

ABN , Publish Date - May 19 , 2026 | 05:15 AM

మావోయిజం ముగింపు దశలో ఉందని, నిఘా విభాగాలు కొత్త సవాళ్లపై దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. హైదరాబాదులోని స్పెషల్‌ ...

ఎస్‌ఐబీ కొత్త సవాళ్లపై దృష్టి సారించాలి

  • మావోయిస్టుల పునరావాస బాధ్యత తీసుకోవాలి

  • సమీక్షలో సూచించిన డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): మావోయిజం ముగింపు దశలో ఉందని, నిఘా విభాగాలు కొత్త సవాళ్లపై దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. హైదరాబాదులోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్ఐబీ) కార్యాలయాన్ని ఆయన సందర్శించి, ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితి, శాంతిభద్రతలకు ఎదురవుతున్న సవాళ్లు, తీవ్రవాద నిరోధక చర్యలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థంగా అణచివేయడంలో ఎస్‌ఐబీ అద్భుతమైన పాత్ర పోషించిందని ఆనంద్‌ కొనియాడారు. 2024 నుంచి 2026 మధ్య తెలంగాణ పోలీసుల ఎదుట 820 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఎస్‌ఐబీ సాధించిన విజయమన్నారు. లొంగిపోయిన వారిలో నలుగురు సెంట్రల్‌ కమిటీ సభ్యులు, 22 మంది ేస్టట్‌ కమిటీ సభ్యులు, ఒక రీజినల్‌ కమిటీ సభ్యుడు, 45 మంది డివిజనల్‌ కమిటీ సభ్యులు, 173 మంది ఏరియా కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 58 ఏకే-47 రైఫిళ్లు, 48 ఇన్సాస్‌ రైఫిళ్లు, 50 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 6 ఎల్‌ఎమ్‌జీలతో పాటు మొత్తం 334 అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాస కార్యక్రమాలను డీజీపీ సమీక్షించారు. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో గౌరవ ప్రదంగా జీవించేందుకు వీలుగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజంలో భాగస్వాములను చేేస బాధ్యత ఎస్‌ఐబీ తీసుకోవాలని ఆనంద్‌ సూచించారు. సోషల్‌ మీడియా ప్రభావం వల్ల యువతలో వస్తున్న మార్పులు, దానివల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై నిఘా పెట్టాలన్నారు. పోలీసు విభాగానికి ఎస్‌ఐబీ వెన్నుదన్నుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌, ఎస్‌ఐబీ ఐజీపీ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 05:15 AM