రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - May 03 , 2026 | 05:12 AM
రోడ్డు ప్రమాదాల నివారణలో కీలకమైన వాహన వేగ నియంత్రణ, భద్రతా ప్రమాణాల అమలు అంశంలో పోలీసులు రాజీ పడొద్దని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
నిబంధనల అమలులో రాజీ వద్దు
ట్రాఫిక్ విభాగానికి డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం
హైదరాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నివారణలో కీలకమైన వాహన వేగ నియంత్రణ, భద్రతా ప్రమాణాల అమలు అంశంలో పోలీసులు రాజీ పడొద్దని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అవుటర్ రింగ్‌రోడ్డుపై వరుసగా రోడ్డు ప్రమాదాలు రుగుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్.. ట్రాఫిక్ విభాగం అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనరద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలని చెప్పారు. రహదారి భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ట్రాఫిక్ మేనెజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోని ఏర్పాటు చేయనుందని, ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని అధికారులకు వివరించారు. ఇది ట్రాఫిక్ నిర్వహణలో కీలకపాత్ర పోషించనుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గవర్నర్ , డిప్యూటీ సీఎంలను కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్
కొత్త డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను శనివారం లోక్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. భవిష్యత్తులో దేశానికి డ్రగ్స్ భారీ ముప్పుగా మారనున్నాయని, మత్తు మందుల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ డీజీపీని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డీజీపీ గవర్నర్‌కు వివరించారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా సీవీ ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశారు.