Nizamabad Jail: జైలులో గంజాయి గుప్పుపై డీజీకి నివేదిక
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:37 AM
నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పు.. అధికారుల దాడిలో ఇద్దరు ఖైదీలకు తీవ్ర గాయాలు’ ఘటనలపై ఐజీ మురళీబాబు, డీఐజీ సంపత్ విచారణ నివేదికను...
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పు.. అధికారుల దాడిలో ఇద్దరు ఖైదీలకు తీవ్ర గాయాలు’ ఘటనలపై ఐజీ మురళీబాబు, డీఐజీ సంపత్ విచారణ నివేదికను జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రాకు సోమవారం అందజేశారు. ‘నిజామాబాద్ సెంట్రల్ జైల్లో గంజాయి ముప్పు..!’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో గతవారం ప్రచురితమైన కథనంపై ఐజీ మురళి, డీఐజీ సంపత్‌లను జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా విచారణాధికారులుగా నియమించారు. ఆమె ఆదేశాల మేరకు నిజామాబాద్ జైలుకెళ్లిన ఐజీ మురళి, డీఐజీ సంపత్.. అధికారులు, సిబ్బంది, ఖైదీలను విచారించారు. పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో ప్రమాద ఘటనపై అరెస్టయిన ఆ సంస్థ ఎండీ కం సీఈఓ అమిత్‌రాజ్ సిన్హాకు సంగారెడ్డి జిల్లా జైలులో లభిస్తున్న సౌకర్యాలపై శాఖలో చర్చ సాగుతోంది. ఈ అంశాలన్నీ ఓ అధికారి చక్కబెడుతున్నట్లు వచ్చిన వార్తలపై డీజీ సౌమ్యా మిశ్రా విచారణ జరుపుతారని సమాచారం.