kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:02 PM
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుతో కలిసి భూమి పూజ చేశారు
కాగజ్‌నగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయం ఆధునిక భవనంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ భవనం పూర్తి అయితే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పోటీ పరీక్షల రాసే విద్యార్ధులకు చక్కగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ భవనం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గ్రంథాలయంతో విద్యార్దుల్లో జ్ఙాన సంపద పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయిలో ఎదుగాలని కోరారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు మాట్లాడుతూ ఆధునిక హంగులతో ఏర్పాటు చేసే ఈ గ్రంథాలయం అందరికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కౌన్సిలర్ ఎమ్మాజీ శారదతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు ఈర్ల విశ్వేశ్వర్ రావు, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, ఎమ్మాజీ సంతోష్‌తో పాటు చిలువేరు సత్యనారాయణ, వీరభద్రచారి పాల్గొన్నారు.
కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
బెజ్జూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం మండలంలోని పోతెపల్లిలో రూ.40 లక్షలు, బారెగూడ, రెబ్బెనలో గ్రామాల్లో రూ.25 లక్షల వ్యయంతో ఉపాధి హామి నిధులతో మంజూరై సీసీ రోడ్లకు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగున్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకం లేక పోతే అభివృద్ధి శూన్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం పూర్తిగా దివాళ తీసిందని చెప్పారు. రాష్ట్రంలో నిధులు లేక మంజూరైన అభివృద్ధి పనులు కాంట్రాక్టరు పూర్తి చేయలేక మధ్యలోనే పనులను వదిలి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. జిల్లాలో అటవీ అనుమతులు లేక పలు అభివృద్ధి పనులు నిలిచి పోయాయని, త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ దశల వారీగా గ్రామాలను అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు, వీవో భవనాలు, సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రామకృష్ణ, సుశీల, రాజం, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, నాయకులు శ్రీశైలం, సుధాకర్‌రావు, శంకర్, మనోహర్‌గౌడ్, రాకేష్, వసీఖాన్, దిగంబర్, కిష్టయ్య, రాజారాం, బాలకృష్ణ, ఏఈలు కృష్ణారావు, జీవన్ తదితరులు పాల్గొన్నారు.