Share News

నిధులున్నా.. ముందుకు సాగని అభివృద్ధి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:48 AM

నిధుల లేమి, పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు... ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలు, నలుగురైదురు డీఈలు, ఏఈలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లతో ఇంజనీరింగ్‌ సెక్షన్‌ కళకళ... ఒకప్పుడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిస్థితి. మరి ఇప్పుడు

నిధులున్నా.. ముందుకు సాగని అభివృద్ధి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నిధుల లేమి, పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు... ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలు, నలుగురైదురు డీఈలు, ఏఈలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లతో ఇంజనీరింగ్‌ సెక్షన్‌ కళకళ... ఒకప్పుడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిస్థితి. మరి ఇప్పుడు ఓవైపు శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిధులు, మరోవైపు అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌, యుఐడీఎఫ్‌, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌, ఇంకోవైపు స్మార్ట్‌సిటీ మిగులు నిధుల వెరసి వెయ్యి నుంచి 1200 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. నగరపాలక సంస్థ అభివృద్ధి పరుగులు పెట్టించాల్సిన పరిస్థితి. ఈ స్థితిలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కనిపించాలి. నిధులు ఉన్నా ఆశించిన మేరకు అభివృద్ధి పనులు జరుగడం లేదు.

వెలవెలబోతున్న ఇంజనీరింగ్‌ విభాగం

50 లక్షలకు పైగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపాల్సిన సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) పోస్టుతోపాటు టెండర్ల నిర్వహణ, అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభించడమే కాకుండా పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అత్యంత కీలకమైన రెండు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు (ఈఈ)లు ఖాళీగా ఉన్నాయి. ఒక డీఈ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో డీఈ లచ్చిరెడ్డికే ఫుల్‌ అడిషనల్‌ చార్జితో ఈఈగా బాధ్యతలు అప్పగించారు. అటు డీఈగా, ఇటు ఇద్దరు చేయాల్సిన ఈఈల బాధ్యతలను, మరోవైపు ఎస్‌ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆయన అదనపు భారంతో అన్ని పనులు సకాలంలో చేయలేని పరిస్థితి నెలకొంది. ఎస్‌ఈ లేక పోవడంతో రెండు కోట్ల సుడా పనులు, యూఐడీఎఫ్‌, స్మార్ట్‌సిటీ మిగులు నిధుల పనులు ఆగిపోయాయి.

పెండింగ్‌లో వందకుపైగా ఫైళ్లు

కొత్తగా స్మార్ట్‌సిటీ మిగులు నిధులు 70 కోట్లు, 840 కోట్ల అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌, 50 కోట్ల యుఐడిఎఫ్‌ పనుల్లో కొన్నిటికి తిరిగి టెండర్లను సకాలంలో నిర్వహించలేక పోవడంతో ఆ పనులు టెండర్‌ దశలోనే నిలిచిపోయాయి. మరోవైపు శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌, యుఐడిఎఫ్‌ నిధులకు సంబంధించిన దాదాపు 200 అభివృద్ధి పనుల టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయగా అందులో సగానికిపైగా అగ్రిమెంట్లు చేయక పోవడంతో ఆ పనులు కూడా ప్రారంభించడం లేదు. ఇంకోవైపు అభివృద్ధి పనులకు అత్యంత కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగంలోని డీబీ సెక్షన్‌లోని ఆపరేటర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందికి సర్‌ ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల పరిశీలన తదితర అదనపు బాధ్యతలు అప్పగించడంతో టెండర్‌ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో టెండర్‌ దశలో కొన్ని, అగ్రిమెంట్‌ దశలో మరికొన్ని, కొత్తగా ఎస్టిమేట్ల దశలో ఇంకొన్ని ఇలా వంద కుపైగా ఫైళ్లు డీబీ సెక్షన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తేనే..

నిధులు సమృద్ధిగా ఉన్నాయి.. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కీలకమైన ఎస్‌ఈ, ఈఈ, డీఈ పోస్టులు ఖాళీగా ఉండడం, డీబీ సెక్షన్‌ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని పనులు ప్రారంభోత్సవాలకే పరిమితమవుతుండగా, మరికొన్ని పనులు పూర్తయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలన లేక నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని, దీనితో మూణ్ణాళ్లకే సీసీ రోడ్లు దెబ్బతిని ప్రజాధనం దుర్వినియోగమవుతతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి ఇంజనీరింగ్‌ విభాగంలో కీలకమైన ఎస్‌ఈ, ఈఈ, డీఈ పోస్టులను భర్తీచేయించి పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

సర్వసభ్య సమావేశం ఎప్పుడు?

టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాలకవర్గ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వాటికి ఆమోదం తెలుపడంతోపాటు సమస్యలపై చర్చించే అవకాశముంటుంది. టెండర్లలో జాప్యంతోనే పాలకవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు మంచినీటి కొరత, మరోవైపు విషజ్వరాలు ప్రబలడంతోపాటు అనేక సమస్యలపై చర్చించేందుకు వేదికైన సర్వసభ్య సమావేశం నిర్వహించక పోవడంతో ఏమి చేయలేకపోతున్నామని కార్పొరేటర్లు వాపోతున్నారు. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి అభివృద్ధి పనులు పూర్తి చేయించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:48 AM