kumaram bheem asifabad- అందరి సహకారంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:42 PM
అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం మండల ప్రత్యేక అధికారి అబ్దుల్ నదీం అద్యక్షతన నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి పాల్గొన్నారు
బెజ్జూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం మండల ప్రత్యేక అధికారి అబ్దుల్ నదీం అద్యక్షతన నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చెందేందుకు పంచాయతీలకు నిధులు ఇస్తుందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా నిధులకు సమస్య ఉన్నా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని వివరించారు. ముఖ్యంగా తాగునీరు, విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అటవీ అనుమతులు అడ్డంకిగా మారడంతో రోడ్లు, వంతెనల పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ విషయంలో అటవీ అధికారులు పట్టుబిగించడం సరికాదన్నారు. సోమిని-కుశ్నపల్లి గ్రామాల మధ్య వంతెనల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లుంబినీనగర్‌లో భూముల విషయంలో అటవీ సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నదని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. స్థానిక సీహెచ్‌సీ లో వైద్యుల నియామకం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యులు స్థానికంగా ఉండి వైద్యసేవలను అందించాలని సూచించారు. అంబగట్టు చెరువు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా బారెగూడ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీ అనుమతుల కోసం మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి రోడ్లు, వంతెనలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారులు గొడవ పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. స్థలం కబ్జా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో బస్టాండ్, సలుగుపల్లి-పెంచికటపేట, కుశ్నపల్లి-సోమిని గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం సభ్యులంతా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు సభాదృష్టికి తీసుకవచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో నాగరాజు, కాగజ్‌నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి సుప్రజ, ఎస్సై సర్తాజ్‌పాషా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అలేఖ్య, ఎంఈవో సునీత, ఇన్‌చార్జీ రేంజ్ అధికారి శ్రావణ్‌కుమార్, ఏపీవో రాజన్న, ఏపీఎం మోహన్‌దాస్, ఏఈలు అంజల్‌కుమార్, సాయికుమార్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.