kumaram bheem asifabad- సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాద్యం
ABN , Publish Date - Sep 29 , 2026 | 10:52 PM
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ 45రోజులకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులంతా హాజరై సభ్యులు అడిగిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు
బెజ్జూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ 45రోజులకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులంతా హాజరై సభ్యులు అడిగిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన సమావేశంలో ఎన్ని సమస్యలు పరిష్కారం చేశారో తెలుసుకోవాలని సూచించారు. మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, ప్రతి సర్పంచ్‌కు పథకాల వివరాలు అధికారులు చెప్పాలని సూచించారు. అప్పుడే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయని వివరించారు. ఈ సందర్బంగా బెజ్జూరు సర్పంచ్ దుర్గం సరోజా మాట్లాడుతూ ప్రతిపక్ష సర్పంచ్ కావడంతో అధికారులు వేధిస్తున్నారని, ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. గ్రామపంచాయతీ రికార్డులు ఉన్నతాధికారులు తీసుకున్నారని, ఎప్పుడు అడిగినా ఇవ్వడం లేదని ప్రస్తావించారు. తాము గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి చేసేదని ప్రశ్నించారు. మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం తీర్మానం చేయడానికి జిమ్నా పత్రికను అధికారులు ఇవ్వడం లేదని వాపోయారు. చిన్నసిద్దాపూర్‌లో అంగన్‌వాడీ భవనం, అంగన్‌వాడీ టీచర్‌ను నియమించాలని సర్పంచ్ పద్మ కోరారు. కుకుడలో పాఠశాల భవనం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని సర్పంచ్ చిరంజీవి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బెజ్జూరులో గ్రంథాలయం మంజూరు చేయాలని సర్పంచ్ చిన్నయ్య కోరారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, వంతెనలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్పంచ్ శంకర్ అధికారులకు తెలిపారు. సులుగుపల్లిలో పాఠశాల స్థలం కబ్జా చేశారని సర్పంచ్ చిన్నయ్య అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో నాగరాజు, ఎస్సై విజయ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అలేఖ్య, ఏఈలు సాయికుమార్, శ్రీని వాస్, జీవన్, అంజల్‌కుమార్, వెటర్నరీ డాక్టర్ లక్ష్మినారాయణ, రేంజ్ అధికారి శ్రావణ్, ఏపీవో రాజన్న, ఏపీఎం మోహన్‌దాస్, పీఏసీఎస్ చైర్మెన్ ఓంప్రకాష్ పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్, (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశానికి కింది స్థాయి అధికారులను కాకుండా మండల స్థాయి పాల్గొని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన నివేదికలను చదివి విన్పించారు. మండల విద్యాధికారి రమేష్ వివరాలు వెల్లడిస్తుండగా, జోక్యం చేసుకున్న సర్పంచ్‌లు మాట్లాడుతూ పాఠశాలలో పర్యవేక్షణ క్షేత్ర స్థాయిలో చేయడం లేదని ఐదో తరగతి విద్యార్థికి సైతం అక్షరాలు రావడం లేదని మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రతి పాఠశాలను తనిఖీ చేసి వివరాలను అందించాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు మాట్లాడుతూ సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని సభా దృష్టికి తెచ్చారు. కనీసం నెలకు ఎన్నిసార్లు నీళ్లు వస్తున్నాయో అధికారులు తెలుసుకోవాలని సూచించారు. పోతెపల్లి సర్పంచ్ దుర్గం పోశన్న మాట్లాడుతూ వరి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని దీనిపై బాద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖ అధికారుల నివేదికలను విన్పిస్తుంటే ప్రతి విషయంలో సర్పంచ్‌లు అడ్డుతగలటంతో సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్, డీటీ చిన్ను, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.