Inspector Caught Red Handed: ఏసీబీకి చిక్కిన దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:20 AM
దేవాదాయ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా కమిషనర్ కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు..
ఏసీబీకి చిక్కిన దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్
50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఏకంగా కమిషనర్ కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.కిరణ్ కుమార్.. బాగ్‌అంబర్‌పేట్‌లో సర్వే నంబరు 616 స్థలానికి సంబంధించిన సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.లక్షన్నర డిమాండ్ చేశారు. ఒప్పందంలో భాగంగా బుధవారం కమిషనర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న తన ఆఫీసులో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం కిరణ్‌కుమార్ కార్యాలయం, ఇంట్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. కాగా, కిరణ్ కుమార్ ఏసీబీకి చిక్కడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గతంలో నల్లగొండ జిల్లాలో పని చేసిన సమయంలో అవినీతి కేసులో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది.