డిప్యుటేషన్ అధికారులకు విధుల కేటాయింపు నిలిపివేత!
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:13 AM
దేవాదాయ శాఖలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు శాఖలో నెలకొన్న అయోమయ పరిస్థితికి నిదర్శనంగా మారాయి.
కమిషనర్ బదిలీ చేసినా.. సిబ్బందిని రిలీవ్ చేయని ఈవో
పెరిగిన రాజకీయ జోక్యం.. దేవాదాయ శాఖలో నెలకొన్న అయోమయం
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు శాఖలో నెలకొన్న అయోమయ పరిస్థితికి నిదర్శనంగా మారాయి. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లు వద్దని సిబ్బంది ఆందోళనలు చేస్తున్నా.. స్వయంగా ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తమకు అనుకూలమైన వారిని ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మండల పంచాయతీ ఆఫీసర్ భాస్కర్, ఎంపీడీవో సుశీల్‌రెడ్డిని ఉన్నతాధికారులు డిప్యుటేషన్‌పై దేవాదాయ శాఖలోకి తీసుకున్నారు. వారి డిప్యుటేషన్లను రద్దు చేయాలని లేదంటే పెన్‌డౌన్ చేసి ఆందోళనకు దిగుతామని సిబ్బంది తేల్చి చెప్పడంతో వెనక్కు తగ్గిన అధికారులు.. డిప్యుటేషన్ అధికారులకు విధుల అప్పగింత ఉత్తర్వులను నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో ఆలయాల నిర్వహణపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మంత్రి కొండా సురేఖ ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవో, మరో అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని విధుల నుంచి తొలగించారు. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, గణేశ్ ఆలయల నుంచి పలువురు సిబ్బందిని బదిలీ చేస్తు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే గణేశ్ ఆలయం నుంచి ఇద్దరు సిబ్బందిని రిలీవ్ చేసిన ఈవో.. మిగతా వారిని బదిలీ చేయకుండా అక్కడే కొనసాగిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు ఈవో బేఖాతరు చేయడంపై సొంతశాఖలో చర్చ మొదలైంది. మరోవైపు బల్కంపేట ఆలయ పూజారి బదిలీ సరైంది కాదని, ఇది శాస్త్ర విరుద్ధమని అర్చకులు వాపోతున్నారు. కాగా, తమకు చట్టప్రకారం దక్కాల్సిన విధులు ఉన్నతాధికారుల తీరువల్ల దక్కడం లేదని, తమకు జరుగుతున్న అన్యాయంపై దేవాదాయ శాఖలో అధికారులు, అర్చకులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈవోలు, ఇతర సిబ్బంది పోస్టింగులు, విధుల కేటాయింపుల్లో రాజకీయ నేతలు తమ ప్రాబల్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.