దేవరకొండ ఎస్‌బీఐ కాంట్రాక్టు ఉద్యోగి మోసం ఖాతాల నుంచి 2.65 కోట్లు స్వాహా
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:37 AM
సుదీర్ఘకాలం లావాదేవీలు నిర్వహించకుండా స్తబ్దుగా ఉన్న, ఫోన్ నంబర్ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలను తన ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసి..
దేవరకొండ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం లావాదేవీలు నిర్వహించకుండా స్తబ్దుగా ఉన్న, ఫోన్ నంబర్ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలను తన ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసి ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఏకంగా రూ.2.65 కోట్లు కాజేశాడు. కస్టమర్ ఫిర్యాదుతో అతని మోసం వెలుగుచూసింది. దేవరకొండకు చెందిన చక్రపాణి మూడేళ్లుగా దేవరకొండలోని డిండి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎస్‌బీఐ శాఖల్లో కొన్ని నెలలుగా లావాదేవీలు జరపకుండా ఉన్న ఖాతాల వివరాలు సేకరించాడు. ఆ ఖాతాలకు తన ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆ ఖాతాల్లోని డబ్బును తన మిత్రుల ఖాతాల్లోకి బదిలీ చేసేవాడు. తర్వాత వారి నుంచి తన ఖాతా కు బదిలీ చేయించుకునేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎస్‌బీఐ శాఖకు చెందిన ఓ కస్టమర్ ఖాతా నుంచి నగదు బదిలీ చేయగా మెసేజ్ రావడంతో అప్రమత్తమైన ఆ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో చక్రపాణి మోసం బయటపడింది. చక్రపాణి ఇలా దాదాపు రూ.2.65 కోట్లు బదిలీచేసినట్లు తేలింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. నిందితుడు చక్రపాణి పరారీలో ఉన్నాడన్నారు.