Share News

2027 డిసెంబరు కల్లా దేవాదుల పూర్త్తి

ABN , Publish Date - May 17 , 2026 | 05:20 AM

దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబరులోగా పూర్తి చేయడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు.

2027 డిసెంబరు కల్లా దేవాదుల పూర్త్తి

  • భూ పరిహారం చెల్లింపుల వేగవంతం: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబరులోగా పూర్తి చేయడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో పెట్టామని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు కోసం రూ.14,422కోట్లు ఖర్చు చేశారని, మరో రూ.3,978 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై సచివాలయంలో శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఽసీతక్కతోపాటు కలిసి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 87.70 శాతం పూర్తయ్యాయన్నారు. కాల్వల లైనింగ్‌, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల ఆలస్యం, భూసేకరణలో జాప్యం..వంటి సమస్యలు ఇబ్బందికరంగా మారాయన్నారు. మూడో దశలో అత్యంత కీలకమైన సవాళ్లు ఉన్నాయన్నారు. ఇప్పటిదాకా 3.33లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని, మరో 2.23లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. 2,659 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని, పరిహారం చెల్లింపులను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా టోకెన్లు జనరేట్‌ చేయాలని అధికారులకు సూచించారు. వివిధ కారణాలతో పనులు ఆగి ఉంటే.. వాటిని రద్దు చేసి, కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు.

Updated Date - May 17 , 2026 | 05:20 AM