డిప్యూటీ కలెక్టర్‌పై వేటు
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:50 AM
ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే వాటిని అక్రమార్కులకు అప్పగిస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి రూ.కోట్లు దండుకున్న...
అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన రామునాయక్ సస్పెన్షన్
సర్కారీ భూములు అమ్మేసిన అధికారులు!
సహకరించిన ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరి సస్పెన్షన్
33.53 గజాల అక్రమ సేల్‌డీడ్‌ల రద్దుకు పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే వాటిని అక్రమార్కులకు అప్పగిస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి రూ.కోట్లు దండుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2013 నుంచి 2018 వరకు డిప్యుటేషన్ మీద హౌసింగ్ బోర్డు భూసేకరణ అధికారి (ఎల్‌ఏవో)గా పని చేసిన రామునాయక్ అనేక భూదందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రస్తుతం రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న రామునాయక్‌ను సస్పెండ్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కోసం హౌసింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో అతని భూ దందాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ ఉద్యోగం నుంచి తొలగించిన ఇఫ్తాకర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరుతో రాము.. హైకోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న హౌసింగ్ బోర్డు స్థలం 33.53 చదరపు గజాలను 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పైనా విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైనే ఉంటుంది. 2025 ఏప్రిల్‌లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించారు. దీంతో అక్రమ సేల్ డీడ్‌లను రద్దు చేయాలని మంత్రి అదేశించారు. భూ దందాలకు సంబంధించి 2017 నుంచి రామునాయక్‌పై పలు కేసులు ఉన్నట్లు పొంగులేటి తెలిపారు. విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 గజాలు, లక్ష్మీగూడలో 130 గజాలు, మహబూబ్ గంజ్‌లో 497 గజాల స్థలాలను పలువురి పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా విచారణ చేయనున్నట్లు మంత్రి వివరించారు. విచారణ నివేదిక అందిన తర్వాత శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌కు మరో పదేళ్లు సర్వీసు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. మరో సూపరింటెండెంట్ బోనానాయక్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడడం అత్యంత దుర్మార్గపు చర్య అని మంత్రి పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించక తప్పదన్నారు.