Deputy CM Bhatti Vikramarka: పంచాయతీ ఫలితాలే మున్సి పోల్స్‌లోనూ ప్రతిబింబించాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:31 AM
ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80-85ు పార్టీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలిచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
‘సీతారామ’తో 3 లక్షల ఆయకట్టు స్థిరీకరణ: తుమ్మల
జలాల వినియోగంలో బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం: ఉత్తమ్
ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80-85ు పార్టీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలిచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలో జరిగే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్థాయి ప్రదర్శించాలని పార్టీ శ్రేణులను కోరారు. నీటి పారుదల, విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రజల అవసరాలు తీరుస్తామన్నారు. అందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టుతోపాటు నర్సింగ్ కాలేజీ, వంద పడకల ఆస్పత్రి, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌కూ శ్రీకారం చుట్టామన్నారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు అవసరమైన పరిశ్రమలు కల్పించాలని సీఎంను కోరారు. జిల్లాకు ఇండస్ట్రీయల్ పార్కుతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో భారత్‌లోనే తొలుత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపడానికి కృషి చేస్తామన్నారు. మరో రూ.4,000 కోట్లు అధికంగా ఖర్చవుతుందని చెప్పినా సీఎం సహకారంతో సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు చేశామన్నారు. భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఇబ్బంది తలెత్తినా 3లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామన్న తుమ్మల.. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయబోమన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గోదావరి, కృష్ణా జలాల వినియోగంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందించలేకపోయారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టుపై మంత్రులంతా సమన్వయంతో పని చేస్తే ఏడాది లోపు పూర్తి చేసి వచ్చే జనవరికల్లా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీనిచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పాలేరు-మున్నేరు లింక్ కెనాల్‌తో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమికి సాగునీరందించవచ్చన్నారు.