Share News

లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తాం: భట్టి

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:26 AM

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తాం: భట్టి

ఆసిఫాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం జంగాం, బూసిమెట్ట, కెరమెరి మండలం మోడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన సభలు, గ్రామస్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు, మహిళా సంఘాలకు రాయితీ రుణాలు, రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో పోటీపడేలా ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వంద పాఠశాలలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. గిరిజనుల ఆభివృద్ధికి ఇందిరా సౌర గిరిజన వికాసం పేరుతో పథకం తీసుకొచ్చామని తెలిపారు. 2023లో నిర్వహించిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలను రాసుకున్నానని, వాటిని బడ్జెట్‌లో పొందుపరిచి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో భోజనం పెట్టి తనతో పాటు నడిచిన గంగుబాయి, లక్ష్మీబాయి కుటుంబాలను హైదరాబాద్‌ ప్రజా భవన్‌కు భోజనానికి రావాలని ఆహ్వానించారు.

Updated Date - Jan 23 , 2026 | 04:26 AM