డిప్యూటీ సీఎం సీపీఆర్‌ఓ మధుసూదన్ హఠాన్మరణం
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:41 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్‌ఓ) మారబోయిన మధుసూదన్(50) గుండెపోటుతో మృతి చెందారు.
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి దిగ్ర్భాంతి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్‌ఓ) మారబోయిన మధుసూదన్(50) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేస్తుండగానే గుండెపోటు రావడంతో సమీపంలోని అపోలో స్పెకా్ట్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరోమారు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మధుసూదన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికల్లో పని చేశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... అత్యంత నిబద్ధత, నిజాయితీ గల పాత్రికేయుడు మధుని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆత్మస్థైర్యం అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మధు భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా మధు అంత్యక్రియలను మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.