బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:49 AM
తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా..
వారికి సకాలంలో రుణం అందించాలి
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ప్రభుత్వ వ్యయంతోనే ఈ లక్ష్య సాధన సాధ్యం కాదని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న విధానాలు అవసరమని పేర్కొన్నారు. 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ) సమావేశం బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించాలన్నారు. రైతురుణం కోసం బ్యాంకును వెతుక్కుంటూ రావడం కాదు... బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలని సకాలంలో వారికి రుణాలు అందింయాలని సూచించారు. డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ సహా ఇతర అనుబంధ రంగాలను అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకురావాలని అన్నారు. రైతుకు రుణం ఇవ్వడమే కాకుండా, ఆ సొమ్మును అధిక, స్థిరమైన వ్యవసాయ ఆదాయంగా మార్చడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. రుణాలను తిరిగి చెల్లించలేకపోతే... రికవరీ చర్యలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించాలన్నారు. ఈ జూన్ నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి రూ.52,337 కోట్ల రుణాలను అందించడం అభినందనీయమని, కానీ... రుణాలు సకాలంలో అందడం ముఖ్యమని సూచించారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరపు మొత్తం రూ.9,72,253 కోట్ల ‘వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ)’లో ఏప్రిల్ నుంచి జూన్‌వరకు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలన్నింటికీ కలిపి రూ.4,05,244 కోట్ల(41.68శాతం) రుణాలను అందజేసినట్లు బ్యాంకులు వివరించాయి. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,81,035 కోట్ల లక్ష్యం కాగా... జూన్ నాటికి రూ.52,337 కోట్ల(28.91శాతం) రుణాలను పంపిణీ చేశామని తెలిపాయి. ఒక్క ఖరీఫ్ సీజన్‌లోనే రూ.58,152 కోట్ల లక్ష్యానికిగాను రూ.20,069 కోట్ల(34.51శాతం) వ్యవసాయ రుణాలను పంపిణీ చేశాయి.