Share News

బీఆర్‌ఎస్‌ను నమ్మితే నాశనమే

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:06 AM

రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

బీఆర్‌ఎస్‌ను నమ్మితే నాశనమే

  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

  • రైతు సంక్షేమమే మా లక్ష్యం: భట్టి విక్రమార్క

ఖమ్మం, జూలై 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/చింతకాని/ఖమ్మం కలెక్టరేట్‌: రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రైతు భరోసా 9 రోజుల్లో రూ.9 వేలకోట్లను రైతుల ఖాతా ల్లో జమచేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు గత రెండున్నరేళ్లలో రూ.67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డులో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యం గా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పండిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేసి, బోనస్‌ కూడా అందించామన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట లక్షన్నర కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వారిని నమ్మితే రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని.. తమ ప్రభుత్వం ఆ నష్టాలను పూడ్చుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోందని పేర్కొన్నారు.


రెండేళ్లలో మరో 15-20 వేల ఉద్యోగాలు: మంత్రి పొంగులేటి

పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో 71 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. రెండేళ్లలో మరో 15-20వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కొందరు ఒంటి నిండా విషం నింపుకొని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్ర లు తమ ప్రభుత్వం మీద ఏమాత్రం పనిచేయవన్నారు. ఇప్పటికే రెండుసార్లు బుద్ధి చెప్పినా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

రైతుభరోసాలో తెలంగాణనే ముందు: మంత్రి తుమ్మల

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద 30 నెలల్లో రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. దేశంలో ఇలా చేసిననది తమ ప్రభుత్వం ఒక్కటేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గతప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. తాము ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు ప్రయోజనం కల్పించడంలో ముందు నిలిచామన్నారు. కాగా, అన్నదాతలే సమాజానికి జీవనాధారమని.. వారి సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ సభలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 06:07 AM