2013లోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్-2
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:33 AM
తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారన్న అంశం కొత్తది కాదని, ఉమ్మడి ఏపీలో 2013 సెప్టెంబరు 16వ తేదీనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని..
మైనింగ్ లీజు క్లియరెన్స్ ఇవ్వడం కొత్త విషయం
కానీ, ఇప్పుడే కేటాయించినట్లు కిషన్‌రెడ్డి చెబుతున్నారు: భట్టి
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారన్న అంశం కొత్తది కాదని, ఉమ్మడి ఏపీలో 2013 సెప్టెంబరు 16వ తేదీనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ గనిలో సింగరేణి సంస్థ మైనింగ్ చేయడానికి అవసరమైన లీజు అనుమతులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కిషన్‌రెడ్డి కొత్తగా తాడిచర్ల బ్లాక్-2 గనిని సింగరేణికి కేటాయించినట్లు చెప్తున్నారని విమర్శించారు. బుధవారం మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం(ఎంఎండీఆర్ యాక్ట్)-2015 రావడానికి ముందే తాడిచర్ల బ్లాక్-2 కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయించాలని యూపీఏ-2 హయాంలోనే నిర్ణయం తీసుకొని తాడిచర్ల-2ను సింగరేణికి కేటాయించారన్నారు. ఈ నేపథ్యంలోనే ‘‘బ్లాకులో మైనింగ్ లీజు క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్, నేను పదే పదే కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. ఇదే అంశంపై 2024 మార్చిలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి, జూలై 4న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. నిరంతర విజ్ఞప్తుల అనంతరం మైనింగ్ లీజు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది’’ అని భట్టి వివరించారు. కేంద్రప్రభుత్వానికి సింగరేణిపై ప్రేమ ఉంటే గోదావరి లోయలో బొగ్గు బ్లాకులను వేలంతో సంబంధం లేకుండా కేటాయించాలని కోరారు. దీనిపై ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2022 అక్టోబరులో కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-2 గనులను వేలం వేసినట్లు గుర్తు చేశారు. సింగరేణికి కేంద్రప్రభుత్వ రంగ సంస్థ హోదాను పునరుద్ధరించాలని కోరారు.