Deputy CM Bhatti Vikramarka: ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా?
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:47 AM
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను చీకొట్టిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌ను మునిసిపోల్స్‌లోనూ ఓడిస్తాం
గోదావరి ఖనిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
1700 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
రూ.163 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై త్వరలో నిర్ణయమని వెల్లడి
గోదావరిఖని, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను చీకొట్టిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలో జరిగే పురపాలక, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగోసారి బీఆర్‌ఎ్‌సను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంటి ఆడబడుచుకు న్యాయం చేయలేని వారు తెలంగాణ ఆడబడుచులను ఉద్ధరిస్తామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం జరిగిన బహిరంగసభలో 1,700 మంది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను పంపిణీ చేసిన భట్టి విక్రమార్క.. రూ.169 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదవాడికి ఇల్లు కట్టిస్తే కమీషన్లు రావని.. రూ.1.5 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గత పదేళ్ల బీఆర్‌ఎస్ సర్కారు దోచుకుందని, కానీ తమ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదవాడైతే చాలు.. పింక్ చొక్కా ఉన్నా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు. త్వరలో కార్మిక సంఘాలు, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి సింగరేణి కార్మిక సమస్యలకు పరిష్కారం కనుగొందామని చెప్పారు.
సింగరేణి పరిధిలోని కోల్‌బెల్ట్ పట్టణాల్లో 76వ నంబర్ జీవో ద్వారా పేదలకు పట్టాలిచ్చే విషయమై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క వెల్లడించారు. జెన్‌కో/ ఎన్‌టీపీసీ ద్వారా రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్ర సాధనకు ఉద్యమించిన జర్నలిస్టులను కేసీఆర్ ప్రభుత్వం వంచించిదన్న భట్టి విక్రమార్క.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్‌రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.