Share News

పట్టణాల అభివృద్ధిపై సీఎంకు ప్రత్యేక విజన్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:31 AM

రాష్ట్రంలోని మునిసిపాలిటీల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక విజన్‌ ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. స్వయంగా మునిసిపాలిటీ మంత్రిత్వశాఖను సీఎం పర్యవేక్షిస్తున్నారన్నారు.

పట్టణాల అభివృద్ధిపై సీఎంకు ప్రత్యేక విజన్‌

  • అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ గెలవాలి: భట్టి విక్రమార్క

మధిర, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మునిసిపాలిటీల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక విజన్‌ ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. స్వయంగా మునిసిపాలిటీ మంత్రిత్వశాఖను సీఎం పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందన్న భట్టి విక్రమార్క.. పౌరుల భద్రతే తమకు ముఖ్యమన్నారు. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఆస్పత్రులు, విద్యుత్‌, విద్యా రంగాల్లో మార్పులు తెస్తున్నామన్నారు. పట్టణాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. 50 ఏళ్లకు సరిపడా మధిర పట్టణాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ మధిరే’ తన నినాదమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళలు రుణాలిచ్చే స్థాయికి ఎదిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 04:31 AM