Share News

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలు : భట్టి

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:01 AM

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలు : భట్టి

  • కృత్రిమ మేధ(ఏఐ) కాల్‌ సెంటర్‌, నీలమణి యాప్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రెండో విడత సీఎం కప్‌ క్రీడల కృత్రిమ మేధ(ఏఐ) కాల్‌ సెంటర్‌, నీలమణి యాప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి కాల్‌ సెంటర్‌, యాప్‌ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు, యువకులు వ్యసనాల బారిన పడకుండా మైదానాలకు తరలి రావాలని కోరారు. 12 జిల్లాల్లో, 44 క్రీడా అంశాల్లో జరిగే ఈ క్రీడల్లో 22,000 మంది క్రీడాకారులు పాల్గొంటుండడం హర్షణీయమన్నారు.

పంచాయతీలకు రూ.256 కోట్లు విడుదల

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంగళవారం రూ.256 కోట్లను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ నిధులను విడుదల చేశారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Feb 18 , 2026 | 05:01 AM