‘పర్యావరణ’ ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలవాలి
ABN , Publish Date - May 20 , 2026 | 03:27 AM
పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్ర్తీయ నిర్వహణ కోసం రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ..
వ్యర్థాల శుద్ధి, చెత్తతో విద్యుదుత్పత్తికి భారీగా నిధులివ్వాలి
‘స్వచ్ఛ భారత్-అర్బన్ 2.0’ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి
న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్ర్తీయ నిర్వహణ కోసం రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల నుంచి విద్యుత్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టుల అమలు కోసం రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘‘స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0’’ సమీక్షలో భట్టి మాట్లాడారు. ‘తెలంగాణ విజన్-2047’ లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణహితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం తెచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026 దేశంలో కీలక మార్పునకు నాంది పలకనుందని, తెలంగాణ ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం కోర్ అర్బన్ ప్రాంతాల్లో 9,596 ఎలక్ర్టిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంప్ యార్డ్ నిర్వహణ కోసం ఐఐటీ బాంబే సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆటోనగర్ డంప్ యార్డులోని 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నామని వెల్లడించారు. జపాన్‌లోని కిటాక్యుషు నగర మోడల్ ఆధారంగా తెలంగాణలోని బండరావిర్యాల, సిద్ధాపూర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ‘ఎకో టౌన్’ రాష్ట్ర సర్క్యులర్ ఎకానమీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణను పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా.. ‘వార్ ఆన్ వేస్ట్ - వేస్ట్ టు వెల్త్’ నినాదంతో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.