పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తాం
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:28 AM
ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి
జర్నలిజమంటే వార్తలు కాదు.. పౌరులను తీర్చిదిద్దడం
‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్‌క్లబ్స్’ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్/మహబూబ్‌నగర్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలన్నారు. శనివారమిక్కడ జరిగిన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ సదస్సు లో ఆయన మాట్లాడారు. వివక్షను ప్రశ్నించడంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. సమాజంలో చోటుచేసుకునే సంఘటనలను రిపోర్ట్ చేయడమే కాకుండా, వాటి అంతరార్థాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత జర్నలిజంపై ఉందన్నారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ్‌లీలా మైదానంలో ప్రసంగించిన రెండు రోజుల తర్వాత కొందరు అక్కడ ‘శుద్ధీకరణ’ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఏఐసీసీ అధ్యక్షుడి విషయంలో ఇలాంటి శుద్ధీకరణ ఘటనలు చోటుచేసుకుంటే.. దేశంలో సమానత్వం, గౌరవం ఏ స్థాయిలో ఉన్నాయో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడం కాదని, పౌరులను తీర్చిదిద్దడమని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ క్లోనింగ్ వంటి సాంకేతికతలతో పుకార్లు వ్యాపిస్తున్న పరిస్థితుల్లో జర్నలిస్టులకు అసలైన ఆయుధం విశ్వసనీయతనేనన్నారు. జర్నలిజాన్ని రక్షించాలంటే జర్నలిస్టులనూ రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల భద్రత, గౌరవం, ఉద్యోగ పరిస్థితులు, సంక్షేమంపై ఫెడరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సదస్సులో ద హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంగీత బారోచ్, కరవన్ పత్రిక ఎడిటర్ అనంతనాథ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ‘ఆంధ్రజ్యోతి’ ఫొటో జర్నలిస్టుకు అవార్డు
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహక బహుమతిని ఆంధ్రజ్యోతి మహబూబ్‌నగర్ ఫొటో జర్నలిస్టు గడ్డం రవికుమార్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అందజేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి శనివారం బేగంపేట ఏఐఎస్ అతిథిగృహంలో డిప్యూటీ సీఎం బహుమతులను అందజేశారు.