అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలపై కమిటీ: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:42 AM
అధికారులతో సమానంగా కోల్ ఇండియా నిబంధనల మేరకు సింగరేణి కార్మికులకు సౌకర్యాల కల్పనకు కమిటీని నియమిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అధికారులతో సమానంగా కోల్ ఇండియా నిబంధనల మేరకు సింగరేణి కార్మికులకు సౌకర్యాల కల్పనకు కమిటీని నియమిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సౌకరాన్ని సంస్థ కార్మికులూ అధికారులకూ కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికుల జబ్బులకనుగుణంగా మెడికల్ ఇన్‌వాలిడేషన్ విషయమై మెడికల్ బోర్డు తగు నిర్ణయం తీసుకునేలా చేస్తామన్నారు. సంస్థలోని 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా అమలు చేస్తున్నామన్న భట్టి.. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ఠ వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తమ సర్కారు ఏర్పాటయ్యాక సంస్థలో 2,539 ఉద్యోగాలు (798 ఎక్స్‌టర్నల్, 1,741 కారుణ్య నియామకాలు) నియమించినట్లు తెలిపారు.