రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు: భట్టి
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:05 AM
వేసవిలో విద్యుత్తు కొరత రావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ కోతలు విధించారని.. తెలంగాణలో మాత్రం కనురెప్పపాటు కూడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని..
విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం కలెక్టరేట్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వేసవిలో విద్యుత్తు కొరత రావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ కోతలు విధించారని.. తెలంగాణలో మాత్రం కనురెప్పపాటు కూడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల ప్రముఖులు తెలంగాణను ప్రశంసించారని పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని పాకబండ బజారులో 11/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. 2023లో రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం 18,548 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి పంపిణీ చేశామని, 3500 మెగావాట్ల కరెంటును ఈ రెండేళ్లలో అదనంగా ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాబోయే 30 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా విద్యు త్తు రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నార్తరన్ పవర్ డిస్కం చైర్మన్ వరుణ్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.