Share News

Harsh Words Cause Distress: చెప్పింది చేయరా?

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:53 AM

వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి...

Harsh Words Cause Distress: చెప్పింది చేయరా?

  • డీఈవోపై వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆగ్రహం

  • పరుషంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన మహిళా అధికారి

  • వెంటనే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిన డీఈవో

వికారాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి (డీఈవో) రేణుకాదేవి సెలవుపై వెళ్లారు. విద్యాశాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన-రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌, మనక్‌ ప్రాజెక్ట్‌) నిర్వహించే సమయంలో ఆమె సెలవుపై వెళ్లడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జిల్లాలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం చేపట్టారు. ఓ కాంగ్రెస్‌ నాయకుడు తమ గ్రామంలోని ప్రీప్రైమరీ స్కూల్‌లో తమకు తెలిసిన వ్యక్తిని నియమించాలని ఎమ్మెల్యేను కోరారు. గత నెల 30న సదరు ఎమ్మెల్యే.. డీఈవోకు ఫోన్‌ చేసి తాను సిఫారసు చేసిన వ్యక్తిని ప్రీప్రైమరీ స్కూల్‌లో నియమించాలని సూచించారు. అయితే ఈ నియామకాలు కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగాయని, డీఈవో వివరించే ప్రయత్నం చేయగా.. ఆయన వినిపించుకోకుండా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరు పడితే వారు చెబితే పనులు చేస్తున్న మీరు... ఓ ప్రజాప్రతినిధి చె బితే చేయరా? అంటూ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపిక గురించి డీఈవో వివరించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా పరుష పదజాలం ఉపయోగించినట్లు ఉపాధ్యాయ, అధికార వర్గాల్లో ప్రచారమవుతోంది. ఎమ్మెల్యే మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన డీఈవో విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె ఎమ్మెల్యే మాటలకు మనోవేదనకు గురై సెలవుపై వెళ్లాలనుకున్నట్టు తెలిసింది. కలెక్టర్‌ అనుమతితో గత నెల 31 నుంచి మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన డీఈవో తన అధికారిక సిమ్‌ విద్యాశాఖ కార్యాలయంలో అప్పగించి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 06 , 2026 | 02:53 AM