Dense Fog: పొగమంచు గుప్పిట..
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:15 AM
రాష్ట్రం పొగ మంచు గుప్పిటలో బందీగా మారింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలకు కూడా పొగ మంచు తెరిపినీయడం లేదు. హైదరాబాద్ నగరం....
రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం 9 దాకా వీడని మంచుతెర
రహదారులపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. తగ్గిన చలి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రం పొగ మంచు గుప్పిటలో బందీగా మారింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలకు కూడా పొగ మంచు తెరిపినీయడం లేదు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలు, ఓఆర్‌ఆర్, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారి, హైదరాబాద్- శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవే, కుమరం భీం జిల్లా సిర్పూర్(యు) మండలంలోని పలు గ్రామాలు, సిరిసిల్ల పట్టణంతోపాటు చాలా ప్రాంతాలను శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం తొమ్మిది గంటలకు కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం తగ్గలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం తొమ్మిది గంటలప్పుడు కూడా వాహనాల లైట్లు వేసుకొని వాహనదారులు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. రహదారి కనిపించక నెమ్మదిగా కదలాల్సి రాగా, కొన్ని ప్రాంతాల్లో లారీలు, బస్సులను డ్రైవర్లు రహదారి పక్కన ఆపేశారు. పొగ మంచు ప్రభావం విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అయోధ్య, చెన్నై, వైజాగ్ వెళ్లాల్సిన విమాన సర్వీసులు పొగమంచు వల్ల రద్దయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్ రావాల్సిన మరో 10 విమానాలు కూడా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించగా, వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 30 సర్వీసులు ఆలస్యమయ్యాయి. రాష్ట్రంలో పొగమంచు ప్రభావం మరో రెండ్రోజులు తీవ్రంగానే ఉంటుందని, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మరింత ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోపక్క, రాష్ట్రంలో చలి కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండంకెలకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 17.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.