Dense Fog: పొగమంచుతో విమానాల రాకపోకలకు బ్రేక్
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:45 AM
పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని సర్వీసులను రద్దు చేయగా మరికొన్ని విమానాలను దారి మళ్లించారు...
పలు విమానాల దారి మళ్లింపు
శంషాబాద్ రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని సర్వీసులను రద్దు చేయగా మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. జీఎంఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున దట్టమైన పొగమంచు కురవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దారి మళ్లించారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అయితే విమానాలు ఆలస్యమైనా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు.