Bandaru Dattatreya: ఓఆర్‌ఆర్ లోపల కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయండి
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:19 AM
మెగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ లోపలి గ్రామాల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్...
ఆ భూములను రెసిడెన్సియల్ జోన్‌కి మార్చాలి
రైతుల భూమిని బలవంతంగా లాక్కోవద్దు
భూ సమస్యలపై సీఎం రేవంత్‌తో చర్చిస్తా : దత్తాత్రేయ
హయత్‌నగర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మెగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ లోపలి గ్రామాల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ (ఆర్ వన్ జోన్) జోన్‌లోనికి మార్చాలని హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటి కొహెడాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై ఫిర్యాదులు అందుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉందని, పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారస్తుల భూములు రెసిడెన్సియల్ జోన్‌లో ఉంటే రైతుల భూములు మాత్రం కన్జర్వేషన్ జోన్‌లో ఉన్నాయని ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాలకు రైతులు సాగుచేస్తున్న భూములను తీసుకుంటే భూమికి భూమి లేదా, 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కున్న నాయకులు బాగుపడ్డ సందర్భాలు లేవన్నారు. మేజర్ గ్రామం అయిన కొహెడాను డివిజన్‌గా ఏర్పాటు చేసి ఎల్‌బీనగర్ జోన్‌లో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఔటర్ లోపలి గ్రామాలు రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై దరఖాస్తులు తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి చర్చిస్తానని హామీ ఇచ్చారు.