GHMC: సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఉండాల్సిందే
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:01 AM
విస్తరిత జీహెచ్‌ఎంసీ విభజనపై ప్రచారం నేపథ్యంలో సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.
చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని విస్మరించొద్దు: స్థానికులు
ఆందోళనలకు పార్టీలు, సంఘాలు సిద్ధం
త్వరలోనే సీఎం వద్దకు కాంగ్రెస్ నేతలు
సికింద్రాబాద్ పేరును కనుమరుగుచేస్తామంటే ఉద్యమమే: తలసాని
హైదరాబాద్ సిటీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): విస్తరిత జీహెచ్‌ఎంసీ విభజనపై ప్రచారం నేపథ్యంలో సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. 220 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంతం పేరుతో కార్పొరేషన్ ఉండాల్సిందేనని రాజకీయ పార్టీలు, కాలనీ, బస్తీ, వ్యాపార సంఘాల నాయకులు కోరుతున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక అస్తిత్వం ఉందని, దానిని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నాయకులూ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు. విలీన మునిసిపాలిటీలతో కలిపి ప్రస్తుత జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారన్న ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రాతిపదికన పోలీస్ కమిషనరేట్ల పరిధిని నిర్ణయించారు. రెవెన్యూ, టీజీఎ్‌సపీడీసీఎల్, వాటర్‌బోర్డు, వాణిజ్య పన్నులు తదితర విభాగాల విభజనా ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనరేట్లకు ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరిగా పేర్లు పెట్టారు. ఇవే పేర్లతో కార్పొరేషన్లుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఆ సర్కిళ్లతో..
పూర్వ జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ జోన్, సర్కిల్ ఉండేది. పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ సర్కిల్ కనుమరుగు కాగా.. జోన్ కొనసాగుతోంది. అయితే జోన్ పరిధి మాత్రం పూర్తిగా మారింది. మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, ఉప్పల్ జోన్ల పరిధిలోని పలు సర్కిళ్లను కలుపుతూ సికింద్రాబాద్ డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానిక రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. జీహెచ్‌ఎంసీని ఎన్ని కార్పొరేషన్లు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తున్నారని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇక.. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రా బాద్ పేరును రూపుమాపేందుకు సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతో కాకుండా వేరొక పేరుతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆదివారం (11వ తేదీ) ఉదయం 11 గంటలకు బాలంరాయ్‌లోని లీ ప్యాలె్‌సలో సమావేశం నిర్వహిస్తామని.. 17న భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే బంద్‌లు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎంకి దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని సవాల్ చేశారు.