తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 178కి
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:16 AM
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొన్నప్పటికీ..
ఏపీలో 265కి.. శాసనసభ స్థానాల పెంపుపై బీజేపీ లెక్కలివే!
పార్టీలో అంతర్గతంగా సర్క్యులేట్ చేస్తున్న పత్రంలో స్పష్టీకరణ
మహిళల కోటా సీట్లు తెలంగాణలో 59.. ఆంధ్రప్రదేశ్‌లో 88
అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా యూపీలో స్థానాలు 605కు
440 సీట్లతో తర్వాతి స్థానంలో బెంగాల్.. మహారాష్ట్రలో 432
రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 26కు పెంపు.. ఆంధ్రప్రదేశ్‌లో 38కి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొన్నప్పటికీ.. అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించుగా 50 శాతం పెరుగుదల ఉంటుందని బీజేపీ నాయకత్వం పార్టీలో అంతర్గతంగా సర్క్యులేట్ చేస్తున్న పత్రం ద్వారా వెల్లడించడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కొంత మంది ముఖ్యమైన మహిళా నాయకులను ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం.. వారితో ఈ వివరాలను పంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ పంపిణీ చేసిన ఈ అంతర్గత డాక్యుమెంట్ ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 కాగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 178కి పెరగనుంది. అంటే దాదాపుగా 49.58 శాతం మేర పెరిగినట్టు. అందులో 33 శాతం సీట్లు.. అంటే 59 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 26కు (51.4 శాతం మేర) పెరగనున్నట్లు పేర్కొంది. వీటిలో 33 శాతం.. అంటే 88 సీట్లు మహిళలకు దక్కుతాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా యూపీలో సీట్లు 605కి పెరుగుతాయని, వాటిలో 200 సీట్లు మహిళలకు దక్కుతాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. యూపీ తర్వాత పశ్చిమ బెంగాల్ సీట్లు 294 నుంచి 440కి పెరుగుతాయని, వాటిలో 145 సీట్లు మహిళలకు దక్కుతాయని తేలింది. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో సీట్ల సంఖ్య 432కి పెరగ్గా... మహిళలకు 143 స్ధానాలు దక్కనున్నాయి. బిహార్‌లో సీట్లు 243 నుంచి 365కి పెరుగుతాయని, వీటిలో 120 సీట్లు మహిళలవేనని బీజేపీ తెలిపింది. లోక్‌సభ విషయానికి వస్తే.. ఏపీలో సీట్లు 38కి పెరుగుతాయని, వాటిలో 12 సీట్లు మహిళలకు లభిస్తాయని బీజేపీ తెలిపింది. తెలంగాణలో సీట్లు 26కు పెరుగుతాయని.. 9 స్థానాలు మహిళలకు లభిస్తాయని పేర్కొంది. లోక్‌సభలో కూడా అత్యధిక మహిళలు యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి రానున్నారు.