పునర్విభజన ఇప్పట్లో లేనట్టే!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:52 AM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో.. నియోజకవర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న...
ప్రస్తుత సీట్ల ప్రకారమే 2029 ఎన్నికలు!.. జమిలి ఎన్నికలు జరిగేదీ అనుమానమే
డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్...బిల్లుతో ముడిపెట్టడంతో భంగపాటు
ఏకపక్షంగా సాధ్యం కాదని స్పష్టం
మళ్లీ బిల్లు పెట్టాలనుకుంటే.. అన్ని పార్టీల మద్దతు సాధించాల్సిందే
2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు లేని సమయం
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో.. నియోజకవర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారమే వచ్చే సాధారణ ఎన్నికలు జరుగుతాయని, జమిలి ఎన్నికలు కూడా అనుమానమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పునర్విభజన, మహిళా బిల్లులను మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలన్న పట్టుదలతో కేంద్రం ఉంటే మాత్రం.. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుని పెట్టాల్సి ఉంటుందని అంటున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌కు ముడిపెడుతూ ప్రవేశ పెట్టడంతో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకంగా ఓటు వేశాయి. దీంతో లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ లేని ఎన్డీయే.. ఏకపక్షంగా పునర్విభజన బిల్లు పెట్టి ఆమోదించుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల నాటికి డీలిమిటేషన్ లేనట్టేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగంలో చేసిన సవరణ, ఇప్పటికే ఆమోదం పొంది ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాల ప్రకారం.. నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ 2026 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత మోదీ ప్రభుత్వ పదవీకాలం 2029లో ముగియనుంది. అంటే జనగణన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, పునర్విభజన ప్రక్రియ కోసం కమిషన్ వేసి, ఆ కమిషన్ తన ప్రక్రియను పూర్తి చేయడానికి ఉన్న సమయం మూడేళ్లు మాత్రమే. జనగణన ప్రక్రియ పూర్తి చేసి గణాంకాలు ప్రకటించడానికే కనీసం రెండేళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత పునర్విభజనకు కమిషన్ వేయడం, ఆ కమిషన్ ప్రక్రియను పూర్తి చేయడం.. ఏడాది లోపు సాధ్యం కాదని పేర్కొంటున్నాయి.
జనాభా లెక్కల ప్రకారం కష్టమే..
జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలూ నష్టపోతాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా విపక్షాలు గట్టిగా వాదన వినిపిస్తున్నాయి. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ విషయంలో ఏకాభిప్రాయం లేనందునే వీగిపోయింది. ఇక 2026 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన.. అదీ ఎన్నికలకు కొద్దినెలల ముందుగా అంటే విపక్ష పార్టీలతో పాటు అప్పటికి కొన్ని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలూ వ్యతిరేకించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సున్నితమైన ఈ అంశంపై ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ఆచితూచి వ్యవహరిస్తుందని విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రికల నాటికి డీలిమిటేషన్ చెబుతున్నాయి. ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ప్రకారమే ఎన్నికలు జరగవచ్చని అంటున్నాయి. పునర్విభజనతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలు కూడా అనుమానమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసుకుని జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న ప్రణాళికతో ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వం ఉంది. అయితే పునర్విభజన ప్రక్రియే పెండింగ్‌లో పడటంతో జమిలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028 డిసెంబరులోనే జరిగే అవకాశం ఉంది.
విపక్షాల మద్దతు కూడగట్టాల్సిందే..!
నియోజకవర్గాల పునర్విభజన చేసి జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న పట్టుదలతో కేంద్రం ఉంటే.. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుల్లో మార్పులు చేసి మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. అయితే ఇప్పటికే లోక్‌సభలో ఒకసారి భంగపాటుకు గురైన ఎన్డీయే.. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రవేశపెట్టడానికి ముందే బిల్లులపై ఏకాభిప్రాయం తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నాయి. 2026 జనాభా లెక్కలతో సంబంధం లేకుండా పునర్విభజనకు అఖిలపక్ష పార్టీలు, స్టేక్ హోల్డర్లతో సమావేశాలు నిర్వహించి.. ఏకాభిప్రాయం సాధిస్తే పార్లమెంటులో ఆ బిల్లులు సాఫీగా ఆమోదం పొందుతాయని చెబుతున్నారు. జమిలి ఎన్నికలకు కూడా మార్గం సుగమం అవుతుందని, పునర్విభజనలో భాగంగా పెరిగిన అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలతోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.