Share News

తెలంగాణలో 25.. యూపీలో 120

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:25 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించింది.

తెలంగాణలో 25.. యూపీలో 120

  • కేంద్ర ప్రతిపాదిత నమూనా ప్రకారం పెరిగే లోక్‌సభ సీట్లివి

  • రేవంత్‌ నమూనాతో తెలంగాణలో 28-32, యూపీలో 100-110

  • జనాభాతోపాటు అభివృద్ధి, పన్నుల వాటాను తీసుకోవాలంటున్న సీఎం

  • కేంద్ర ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయమని వాదన

  • 3 నమూనాలతో సీట్ల వ్యత్యాసాలను తెలుపుతూ జాబితా సిద్ధం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న సీట్లను 50శాతం పెంచనుందనే ప్రచారం జోరుగా సాగినా.. తాజా ప్రతిపాదనల్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రతిపాదించినందున.. అది అమలు కావాలంటే రాష్ట్రాల వారీగా సీట్లను మరో 50 శాతం పెంచాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందని వాదిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌.. అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల ఆర్థిక పనితీరు ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి, జీఎ్‌సడీపీ ఆధారంగా సీట్ల పెంపు ఉండాలని మరో ప్రతిపాదన చేశారు. ఈ రెండు నమూనాలపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. కేంద్రం నమూనా ఏమిటి? సీఎం రేవంత్‌ సూచించిన రెండు హైబ్రిడ్‌ నమూనాలు ఏమిటి? వాటి ఆధారంగా సీట్లు విభజిస్తే ఏ రాష్ట్రంలో ఏ మేరకు పెరుగుతాయో చూద్దాం..

కేంద్ర నమూనా ఏం చెబుతోంది..?

ఈ నమూనాలో రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లకు మరో 50 శాతం కలుపుతారు. దీనివల్ల ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయి. తక్కువ సీట్లు ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడే ప్రమాదం ఉంది. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. 50 శాతం సీట్ల పెంపుతో 271 లోక్‌సభ స్థానాలు అదనంగా పెరిగితే,, అందులో 136 సీట్లు 7 రాష్ట్రాలకే కేటాంచాల్సి వస్తుంది.


రేవంత్‌ హైబ్రిడ్‌ నమూనా 1: ఈ నమూనా ప్రకారం దేశవ్యాప్తంగా పెంచాలనుకుంటున్న సీట్లలో 50 శాతం జీడీపీ/జీఎస్‌డీపీ ఆధారంగా, మరో 50 శాతం సీట్లను ఆ రాష్ట్ర ఆర్థిక పనితీరు, జనాభా ఆధారంగా పెంచాలి. జీడీపీ/జీఎస్‌డీపీ వృద్ధికి 70 శాతం, తలసరి ఆదాయ జీడీపీకి 15 శాతం, తలసరి ఆదాయానికి 15 శాతం వెయిటేజీ ఇవ్వాలి. దీని వల్ల కుటుంబ నియంత్రణ, ఆర్థిక పురోగతి సాధించిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా బలంగా ఎదిగిన రాష్ట్రాలకు గుర్తింపు ఉంటుంది. ఉత్తర, దక్షి ణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది.

రేవంత్‌ హైబ్రిడ్‌ నమూనా 2: ఈ నమూనా ప్రకారం 40 శాతం జనాభా, 40 శాతం ఆర్థిక పనితీరు, 20 శాతం సమాఖ్య స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించాలి. దేశంలో ఏ ఒక్క ప్రాంతం పార్లమెంట్‌లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉండకూదన్నదే దీని ఉద్దేశం. ఈ నమూనా ద్వారా ప్రాంతీయ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు రక్షణ ఉంటుంది. సమాఖ్య స్ఫూర్తి బలపడుతుంది.

Updated Date - Apr 15 , 2026 | 04:25 AM