డీలిమిటేషన్.. ఒక రాజకీయ కుతంత్రం
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:15 AM
కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు(నియోజకవర్గాల పునర్విభజన)ను దక్షిణాదిలోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాలని తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో...
దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు
బిల్లుపై అఖిలపక్షం ఆందోళన
ఏప్రిల్ 18న నిరసన ర్యాలీ: పొన్నం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు(నియోజకవర్గాల పునర్విభజన)ను దక్షిణాదిలోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాలని తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వక్తలంతా డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచితే కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం నియోజక వర్గాల మార్పు మాత్రమే కాదని, దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యాన్ని రుద్దే ప్రయత్నమని వారు విమర్శించారు. కుటుంబ నియంత్రణను పాటించి అభివృద్ధి సాధించిన దక్షిణాదికి డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షలా పరిణమిస్తుందన్నారు. జనాభా పెరిగిన ఉత్తరాదికి లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని, అభివృద్ధి సాధించిన దక్షిణాదికి సీట్లు తగ్గే ప్రమాదం ఉందని నేతలు హెచ్చరించారు. ఈ ప్రక్రియను నిరసిస్తూ 18న ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు భారీర్యాలీ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తామంతా స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తరాది, దక్షిణాదిల మధ్య చిచ్చుపెట్టే డీలిమిటేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ల పట్ల మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లోనే ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన, స్థానాల పెంపు ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్‌కు అప్పగించడంపై ఎమ్మెల్సీ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా?.. అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగానికి మరణశాసనం రాస్తున్నారంటూ న్యాయశాస్త్ర అధ్యాపకుడు మాడభూషి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూత్వ అజెండా అమల్లో భాగంగానే మోదీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు.