జలవనరుల నిర్వహణపై.. నేడు ఢిల్లీలో సదస్సు
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:01 AM
దేశంలో జలవనరుల సుస్థిర నిర్వహణ, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సోమవారం ఢిల్లీలో కీలక సదస్సు జరగనుంది.
కేంద్ర, రాష్ట్రాల సమన్వయమే లక్ష్యం
8 ప్రధాన అంశాలు అజెండాగా కేంద్రం సమీక్ష
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల అధికారులు
నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్.. జలశక్తి శాఖ,
ఎన్డీఎస్ఏ ఉన్నతాధికారులతో భేటీ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దేశంలో జలవనరుల సుస్థిర నిర్వహణ, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సోమవారం ఢిల్లీలో కీలక సదస్సు జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం ఆధ్వర్యంలో ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ అత్యున్నత కార్యదర్శుల అఖిల భారత సదస్సు’ను నిర్వహించనున్నారు. సుష్మాస్వరాజ్ భవన్‌లోని చాణక్య హాల్ ఈ సమావేశానికి వేదిక కానుంది. కేంద్ర జలశక్తిమంత్రి సి.ఆర్.పాటిల్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతోపాటు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశంలో జల వనరుల సంరక్షణ, సంస్కరణలకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ‘ఆధునీకరణ- కమాండ్ ఏరియా అభివృద్ధి, నీటి నిర్వహణ (ఎమ్-సీఏడీడబ్ల్యూఎ)’ పథకంపై సమీక్షిస్తారు. నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు దేశవ్యాప్తంగా నెల రోజులపాటు చేపట్టబోయే ప్రత్యేక ‘క్యాచ్ ది రెయిన్’ ప్రచారంపై ముసాయిదాను ఖరారు చేస్తారు. నీటిపారుదల, వరద నిర్వహణ, బహుళ ప్రయోజన ప్రాజెక్టుల కోసం సవరించిన ముసాయిదా ప్రాజెక్ట్ మదింపు మార్గదర్శకాలు, జలాశయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆనకట్టల రూల్ కర్వ్ అమలు తీరుపైనా చర్చించనున్నారు. దీనితోపాటు జల సంస్కరణల చట్టం (ఎస్‌డబ్ల్యూఆర్‌ఎఫ్) అమలు, వచ్చే డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ‘సమగ్ర డ్యామ్ భద్రతా మూల్యాంకనాన్ని (సీడీఎస్ఈ)’ పూర్తి చేయడంపై కార్యాచరణను రూపొందించనున్నారు. జల సంరక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచే రాష్ట్రాలకు ఇచ్చే ‘మోడల్ ేస్టట్ వాటర్ అవార్డుల’ కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావడంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సోమవారం సీఎంతో కలిసి దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎ్‌సఏ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏఐబీపీ పథకం కింద దేవాదులకు ఇంకా అందాల్సిన నిధుల విడుదల, మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ఎన్డీఎస్‌ఏ సాంకేతిక కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.